నిర్మాణ రంగంలో 1.4 లక్షల డాలర్ల ఖర్చు
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసే ఆలోచన
నెట్ వర్క్ డివైజ్ లు, ప్రొడక్టులను ఇక్కడ అసెంబుల్ చేసి విదేశాలకు ఎగుమతి చేయడం
ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమని సంకేతాలిచ్చిన సర్వే
బడ్జెట్‌కు కీలకమైన ‘ఆర్థికసర్వే 2019-20’ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో శుక్రవారం ప్రవేశపెట్టారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6-6.5 శాతం వరకు నమోదుకావచ్చని సర్వేను కోట్ చేస్తూ తెలిపారు. 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న టార్గెట్‌ను తప్పకుండా చేరుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని, 2030 నాటికి ఎనిమిది కోట్ల జాబ్స్‌ను సృష్టించడానికి ప్రయత్నిస్తామని వివరించారు. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ తయారు చేసిన ఈ ఆర్థికసర్వేను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఇక కేంద్ర బడ్జెట్‌ను మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెడుతారు. మరో విశేషం ఏమిటంటే ఈసారి సర్వే కవర్ పేజీలను ఊదారంగులో ముద్రించారు. పాతకొత్త కలయికను సూచించేందుకే ఇలా చేశామని సీఈఏ అన్నారు. మరిన్నికంపెనీలకు మార్కెట్లను అందుబాటులోకి తేవడం, వ్యాపార అనుకూల విధానాలను అమలు చేయడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సర్వేను తయారు చేశారు.
– న్యూఢిల్లీ
కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇండియా ఎకానమీ గ్రోత్ బాగా పుంజుకుంటుంది. 2020–21లో జీడీపీ వృద్ధిరేటు 6–6.5 శాతం వరకు రికార్డవుతుంది. వచ్చే ఏడాది హెచ్2లో గ్రోత్ మరింత పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఐదు శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసిన సంగతి తెలిసిందే.
ఎకానమీని పట్టాలెక్కించడం అన్నింటికంటే ముఖ్యం కాబట్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి టార్గెట్‌గా పెట్టుకున్న ద్రవ్యలోటు లక్ష్యాలను సడలించాలి. వృద్ధిరేటును పెంచడానికి సంస్కరణలను వేగంగా అమలు చేయాలి.
ఉపాధి కల్పనకు మరింత ప్రాధాన్యం ఇస్తారు. 2025 నాటికి నాలుగు కోట్ల, 2030 నాటికి ఎనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తారు. మేకిన్ ఇండియా కార్యక్రమం, నెట్‌వర్క్ డివైజ్‌ల ఎగుమతుల ద్వారా, ప్రొడక్టులను ఇక్కడ అసెంబుల్ చేసి విదేశాలకు పంపించడం ద్వారా ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించవచ్చు.
జీడీపీ గ్రోత్‌ను అతి ఎక్కువగా అంచనా వేయలేదు. మరీ తక్కువగా లెక్కగట్టలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ పరిస్థితులు ఇండియాకు అనుకూలంగా ఉంటాయి.
అప్పుల రద్దు, ఆహారంపై రాయితీలు ఇవ్వడం వల్ల స్వేచ్ఛా మార్కెట్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అప్పుల రద్దు వల్ల లోన్లు ఇచ్చే విధానానికి ఆటంకాలు కలుగుతున్నాయి. దీనివల్ల రైతులకే బ్యాంకుల నుంచి అప్పులు పుట్టని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎంఎస్‌ఎంఈలకు మరిన్ని లోన్లు ఇవ్వడానికి, టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వడానికి, మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడానికి సాయం చేస్తారు.
వృద్ధికి ఉన్న ఇబ్బందులు తొలగించాలంటే 1.40 ట్రిలియన్ డాలర్లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు చేయాలి. కరెంటు కోతలు, తగినన్ని రవాణా సదుపాయాలు లేకపోవడం, తగిన కనెక్టివిటీ లేకపోవడం వంటివి కూడా ఐదు ట్రిలియన్ డాలర్ల టార్గెట్‌ను చేరుకోవడానికి ఆటంకాలు అవుతాయి. హైవేలు, రోడ్లపై 2014 నుంచి 2019 వరకు పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయి.
గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు జీఎస్టీ వసూళ్లు పెరిగినందున.. ద్రవ్యలోటును 3.3 శాతానికి తగ్గించడం సాధ్యపడవచ్చు. వచ్చే ఏడాది జీఎస్టీ ఆదాయం పెరుగుతుంది.
ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులకు ఎంప్లాయి స్టాక్ ఆప్షన్స్‌ను కేటాయించాలి. దీనివల్ల వారు ఆ సంస్థలకు యజమానులు అవుతారు. అంతేగాక బ్యాంకుల రిస్క్ సామర్థ్యం పెరుగుతుంది.
ఇక నుంచి ప్రభుత్వం సీపీఎస్‌ఈల్లోని తన వాటాను ప్రత్యేక కార్పొరేట్ కంపెనీకి బదలాయించాలి. ఇది క్రమంగా ఈ వాటాలను అమ్మాలి. ఫలితంగా ప్రభుత్వ సంస్థల పోటీతత్వం, సామర్థ్యం పెరుగుతాయి.
గత దశాబ్దకాలంగా ఎగుమతులు పెరుగుతున్నాయి. 2018లో ఇవి 2.5 శాతానికి చేరుకున్నాయి. వస్తు ఎగుమతుల కంటే సర్వీసుల ఎగుమతులు పెరిగాయి.
ఈక్విటీ, డెట్ పబ్లిక్ ఇష్యూల ద్వారా ఇండియా కంపెనీలు గత ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు రూ.74 వేల కోట్లు సేకరించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇవి 66 శాతం ఎక్కువ. ఎక్కువ కంపెనీలు రైట్స్ ఇష్యూలపై ఆసక్తి చూపుతున్నాయి.
అనేక మంది చిన్నారులు స్కూలు చదువును ఆపేస్తున్నారు (డ్రాపౌట్లు). పైచదువుల కోసం చాలా మంది దగ్గర డబ్బు ఉండటం లేదు. అందరికీ విద్య కోసం 2018లో కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్ష పథకాన్ని అమలు చేస్తోంది.
