NASA: అదే జరిగితే..12 ఏళ్లలో అందరం చనిపోతాం!

ప్రపంచం అంతం అయిపోతుందంటూ మళ్లీ మొదలెట్టారు..! అని తేలిగ్గా తీసిపారేయకండి. జరుగుతున్న పరిణామాలు, నాసా (NASA) హెచ్చరికలు చూస్తుంటే పోయే కాలం దగ్గరకు వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకు కారణాలూ లేకపోలేదు. అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరుగుతోన్న ఓ గ్రహశకలం భూమి వైపు వేగంగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది ఢీకొంటే భూ వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు. 

ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టేందుకు 72 శాతం అవకాశాలు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తమ తాజా నివేదికలో వెల్లడించింది. జూన్ 20న ఈ ఊహాజనిత సారాంశాన్ని విడుదల చేసింది. సమీప భవిష్యత్తులో అలాంటి గ్రహశకలం ఏదీ గుర్తించబడనప్పటికీ, రాబోవు 12 ఏళ్లలో ప్రమాదం జరగొచ్చని భావిస్తున్నారు. 

ఏప్రిల్‌లో నాసా ఐదవ ప్లానెటరీ డిఫెన్స్ ఇంటరాజెన్సీ టాబ్లెట్‌టాప్ ప్రాక్టీస్‌ సెషన్ నిర్వహించింది. ఈ పరిశీలనల్లో నాసా ఉద్యోగులు సహా మొత్తం 100 మందికిపైగా పాల్గొన్నారు. ఆ పరిశీలనల్లో ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించి.. విశ్వాన్ని శోధించారు. అప్పుడు గతంలో మునుపెన్నడూ గుర్తించని ఒక గ్రహ శకలాన్ని గుర్తించారు.  

ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ గ్రహశకలం ఏప్రిల్ 13, 2029న ఒకసారి.. 2036లో మరోసారి భూమిని దాటి వెళ్తుందని శాస్తవేత్తలు అంచనా వేశారు. అంటే, ఈ కాలంలోపు గ్రహశకలం.. భూమిని ఢీకొనే అవకాశాలు ఉన్నాయట. అయితే, గ్రహశకలం పరిమాణం ఎంతనేది స్పష్టంగా గుర్తించలేకపోయారు. 370 మీటర్ల వ్యాసం కలిగివుండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. చూడాలి మరి..! ఈసారైనా నాసా అంచనా అయినా నిజమవుతుందో.. లేదా మరోసారి భూమి అంతం కాబోతుంది అని వార్త రాయవలసి వస్తుందో..