మహదేవపూర్, వెలుగు : తెలంగాణ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 700 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై, విజిలెన్స్ ఆఫీసర్లు శుక్రవారం పట్టుకున్నారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం నుంచి మహారాష్ట్రలోని సిరోంచకు కొందరు వ్యక్తులు రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు ఆఫీసర్లకు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. శుక్రవారం తెల్లవారుఝామున రెండు లారీలు, రెండు బొలెరో వెహికల్స్ రావడంతో వాటిని ఆపేందుకు ప్రయత్నించారు.
వాహనాలను ఆపకుండా పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఆఫీసర్లు వెంబడించి కాళేశ్వరం ఇంటర్ స్టేట్ బ్రిడ్జి వద్ద పట్టుకున్నారు. నాలుగు వెహికల్స్‌ను సీజ్ చేసి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లై ఎస్పీ శశిధర్‌రాజు చెప్పారు. దాడుల్లో అడిషనల్ ఎస్పీలు ప్రభాకర్, శ్రీధర్‌రెడ్డి, సీఐలు ప్రసాద్, లక్షయ్య, మహదేవపూర్ సీఐ రాజేశ్వర్‌రావు, కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్ పాల్గొన్నారు.
