తమ అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాకి వెళ్లినందుకు పై అధికారుల ఆగ్రహానికి గురయ్యారు ఆరుగురు ఎస్సై లు. స్వాతంత్య్ర సమరయోధుని జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ నటించిన ‘సైరా నరసింహా రెడ్డి’ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను తొలిరోజే చూడాలని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు కూడా అనుకుంటాడు.
అసలే మెగాస్టార్ అంటే వీరాభిమానం, పైగా తమ జిల్లా వాసి అయిన ఓ యోధుని కథ. దీంతో కర్నూల్ జిల్లాలో పని చేసే ఆరుగురు ఎస్సైలు బుధవారం స్థానిక కోవెలకుంట్లలోని ఓ థియేటర్ లో సైరా నరసింహ రెడ్డి బెనిఫిట్ షో కి వెళ్లారు. సినిమా చూసే సమయంలో ఓ సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఈ సంగతి జిల్లా ఎస్పీ పకీరప్పకు తెలియడంతో వారిపై కోప్పడ్డారు. డ్యూటీ వదిలేసి మరీ సినిమాకి వెళ్లడంతో ఆ ఆరుగురు ఎస్సై లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆరుగురిపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది.

