రెండు మర్డర్​ కేసుల్లో ఆరుగురికి జీవిత ఖైదు .. రంగారెడ్డి జిల్లా అదనపు సెషన్స్​కోర్టు తీర్పు

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నమోదైన రెండు వేర్వేరు హత్య కేసుల్లో ఆరుగురికి జీవిత ఖైదు పడింది. ఈ మేరకు ఎల్బీ నగర్ లోని రంగారెడ్డి జిల్లా అదనపు సెషన్స్​కోర్టు జడ్జి శుక్రవారం తీర్పు వెల్లడించారు. 2015లో శ్రీరాములు అనే వ్యక్తిపై రేగడి ఘనాపూర్​గ్రామానికి చెందిన కొమురయ్య, కుర్వ రామచంద్రయ్య దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీరాములు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.  ఈ కేసును విచారించిన ఎల్బీనగర్​కోర్టు కొమురయ్య, రామచంద్రయ్య దాడి చేయడంతోనే శ్రీరాములు చనిపోయాడని తేల్చింది. ఇద్దరికి జీవిత ఖైదుతోపాటు రూ.5వేల చొప్పున జరిమానా విధించింది. 

అలాగే.. అనుమానంతో భార్యను చంపిన భర్తకు..అతనికి సహకరించిన ముగ్గురికి కోర్టు శిక్షను ఖరారు చేసింది. వికారాబాద్​ జిల్లా పూడూరుకు చెందిన చేవెళ్ల కుమార్ 2010లో అలివేలు అనే మహిళను పెండ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమె వేరొకరితో చనువుగా మాట్లాడుతుండటంతో అనుమానం పెంచుకున్నాడు. తన మిత్రులు చేవెళ్ల సాయన్న, మైలారం శ్రీశైలం, మేకల రాజుతో కలిసి 2012లో అలివేలును, ఆమె కూతురిని గొంతు కోసి చంపి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ కేసును ఇటీవల విచారించిన రంగారెడ్డి జిల్లా అదనపు సెషన్స్​కోర్టు వారిని దోషులుగా తేల్చింది. శుక్రవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. అలాగే ఒక్కొక్కరికి రూ.40 వేల చొప్పు జరిమానా విధించింది.