ఢిల్లీ, ముంబైలో..పొల్యూషన్​ వశపడ్తలేదు

ఢిల్లీ, ముంబైలో..పొల్యూషన్​ వశపడ్తలేదు

న్యూఢిల్లీ :  వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ, ముంబైలో నివసిస్తున్న 60 శాతం మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. 10 మందిలో ఆరుగురు మకాం మార్చేందుకు సిద్ధంగా ఉన్నారని సర్వే రిపోర్టు వెల్ల డించింది. ఢిల్లీ, ముంబై నగరాలతో పాటు సమీపంలోని ప్రాంతాలకు చెందిన 4,000 మందిపై హెల్త్‌ కేర్ ప్రొవైడర్ ప్రిస్టిన్ కేర్ ఈ సర్వే నిర్వహించింది.

అక్కడ 10 మందిలో తొమ్మిది మంది నిరంతర దగ్గు, శ్వాసలోపం, గురక, గొంతు నొప్పి, దురద వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారని సర్వేలో తేలింది. గాలిలో నాణ్యత క్షీణించడం వల్లే ఈ ప్రభావం కనిపిస్తోందని వెల్లడించింది. 40 శాతం మందిలో ఈ వింటర్​ సీజన్​లో ఆస్తమా లేదా బ్రాన్కైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలను గమనించారు.10 మందిలో నలుగురు ప్రతి సంవత్సరం వాయు కాలుష్యానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలపై ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారని సర్వే రిపోర్ట్​ పేర్కొంది.

ఈ టైంలో 35 శాతం మంది వ్యాయామం, రన్నింగ్ వంటి బహిరంగ కార్యకలాపాలను నిలిపివేసినట్లు సర్వేలో తేలింది. ఢిల్లీ, ముంబైలలో కేవలం 27 శాతం మంది ఎయిర్ ప్యూరిఫైయర్​లను వాడుతున్నట్లు అంగీకరించారని, అయితే ఆశ్చర్యకరంగా 43 శాతం మంది ఇప్పటికీ "వాటి వాడకం రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందనే అపోహను కలిగి ఉన్నారని" నివేదిక పేర్కొంది.