ఎక్కువ ధరల ప్లాన్లలో 5జీ

ఎక్కువ ధరల ప్లాన్లలో 5జీ

న్యూఢిల్లీ :  తమ 5జీ సేవలను హయ్యర్​ టారిఫ్ ప్లాన్లు తీసుకున్న కస్టమర్లకు మాత్రమే అందిస్తామని భారతీ ఎంటర్‌‌ప్రైజెస్ వైస్ చైర్మన్ అఖిల్ గుప్తా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. వీటికోసం  ప్రత్యేకంగా ప్రీమియం వసూలు చేయబోమని అన్నారు. డేటా వినియోగం పెరిగే కొద్దీ కస్టమర్లు సూపర్‌‌ఫాస్ట్ నెట్‌‌వర్క్‌‌కి అప్‌‌గ్రేడ్ అవుతారని పేర్కొన్నారు. “5జీ సేవలు చాలా వేగంగా వ్యాపిస్తాయన్నది నా నమ్మకం.  5జీ హ్యాండ్‌‌సెట్ ఉన్న ఎవరైనా 5జీని పొందుతారు. వాళ్లు ఎక్కువ డేటా వాడతారు. ఆటోమేటిక్​గా హయ్యర్​ టారిఫ్ ప్లాన్‌‌కి వెళతారు. దీని వల్ల మా ఆదాయాలు పెరుగుతాయి. పూర్తి ప్రీమియం 5జీ లాంటిది ఉండదు. కొంచెం ఎక్కువ ధరల ప్లాన్లలో 5జీని అందిస్తాం” అని ఆయన వివరించారు.

5జీ వల్ల కస్టమర్లు ఫాస్ట్​ ఇంటర్నెట్‌‌తో ఎక్కువ డేటాను వినియోగిస్తారని, టెల్కోలకు అధిక ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు. గ్లోబల్ రేట్లతో పోలిస్తే భారతదేశంలో టారిఫ్ ప్లాన్‌‌లు చాలా తక్కువగా ఉన్నాయని గుప్తా అన్నారు. ఈ ఏడాది జూన్‌‌తో ముగిసిన క్వార్టర్​లో రూ.183  ఏఆర్​పీయూతో (యావరేజ్​ రెవెన్యూ పెర్ ​యూజర్​)  ఎయిర్​టెల్​ మిగతా ఆపరేటర్ల కంటే ముందంజలో ఉంది. భారతీయ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లందరికీ ఏఆర్​పీయూ రూ.200 కంటే తక్కువగా ఉంది. పోయిన నవంబర్‌‌లో ప్రీపెయిడ్ టారిఫ్‌‌లను 20–-25 శాతం పెంచగా, ఈ ఏడాది టారిఫ్‌‌లను మరింత పెంచనున్నట్టు టెల్కోలు తెలిపాయి.