5జీ స్పెక్ట్రమ్ వేలంపాట ఇవాళ మొదలైంది. ఇందులో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ ఎంటర్ ప్రైజెస్ పాల్గొన్నాయి. మొత్తం రూ. 4.3 లక్షల కోట్లు విలువైన ఈ వేలంలో.. తొలి రోజున నాలుగు రౌండ్ల బిడ్డింగ్ జరిగింది. 72 గిగా హెర్ట్జ్ ల 5జీ స్పెక్ట్రమ్ కోసం రూ.1.45 లక్షల కోట్లు విలువైన బిడ్లు దాఖలయ్యాయి. 700 మెగా హెర్ట్జ్ ల 5జీ బ్యాండ్ కోసం కూడా కంపెనీలు బిడ్లను సమర్పించాయి. ఈవివరాలను కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఐదో రౌడ్ వేలంపాట రేపు (బుధవారం) జరగనుంది. ఆగస్టు 15కల్లా 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరికల్లా దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కాగా, ఈ వేలంపాట కోసం రిలయన్స్ జియో రూ.14వేల కోట్లు, ఎయిర్ టెల్ రూ.5,500 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.2,200 కోట్లు, అదానీ డాటా నెట్ వర్క్స్ రూ.100 కోట్లు ముందస్తు డిపాజిట్ చేశాయి.
5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ? 5జీ ఇంటర్నెట్ వచ్చాక 5జీబీ మూవీ వీడియోను 35 సెకన్లలోనే డౌన్ లోడ్ చేయొచ్చు. ఇదే మూవీని 4జీ ఇంటర్నెట్ తో డౌన్ లోడ్ చేయడానికి 40 నిమిషాలు, 3జీతో డౌన్ లోడ్ చేయడానికి 2 గంటల సమయం పడుతుంది. 2జీ ఇంటర్నెట్ తో డౌన్ లోడ్ చేసేందుకు దాదాపు 2.8 గంటల సమయం అవసరం. ఇప్పటికే టెల్కోలు పలు ప్రాంతాల్లో 5జీ సర్వీసుల ట్రయల్స్ నిర్వహించాయి. అంటే 5జీ వేలం తర్వాత వేగంగానే 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చే చాన్స్ ఉంది.
