హైదరాబాద్ లో 1.25 కోట్ల పప్పి స్ట్రా డ్రగ్స్ సీజ్

  • మధ్యప్రదేశ్ నుంచి డ్రగ్స్ తెస్తుండగా పట్టివేత
  • ముగ్గురు అరెస్ట్.. ఫోన్లు స్వాధీనం
  • మార్కెట్​లో దీని విలువ రూ.1.25 కోట్లు : సీపీ సుధీర్ బాబు

ఎల్బీనగర్, వెలుగు: హైదరాబాద్ లో 53.50 కిలోల పప్పి స్ట్రా డ్రగ్స్ పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.1.25 కోట్లు ఉంటుందని ఎల్బీనగర్ ఎస్​వోటీ పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశామని, వారి వద్ద నుంచి మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్​లోని రాచకొండ సీపీ ఆఫీస్​లో సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. రాజస్థాన్​కు చెందిన మంగిలాల్ భీశాయ్.. హైదరాబాద్ మీర్​పేట్ నాదర్​గుల్​లోని అశోక్​రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. 

స్టీల్ రేలింగ్ వర్క్ చేస్తూ మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్​కు డ్రగ్స్ సప్లై చేస్తుంటాడు. మధ్యప్రదేశ్​కు చెందిన పింటు అలియాస్ మోహన్ సింగ్ వద్ద మంగిలాల్ భీశాయ్ పప్పి స్ట్రా డ్రగ్స్ కొనుగోలు చేశాడు. అశోక్ రెడ్డి కాలనీలోనే నివాసం ఉంటున్న రాజస్థాన్​కు చెందిన మంగిలాల్ దాక, భీరారామ్​తో ట్రైన్​లో హైదరాబాద్​కు డ్రగ్స్ తెప్పించాడు. ఈ ముగ్గురు కలిసి ఆదివారం అశోక్ రెడ్డి నగర్ నుంచి డ్రగ్స్ తరలించే ప్రయత్నం చేయగా.. పక్కా సమాచారంతో ఎల్బీనగర్ ఎస్​వోటీ, మీర్ పేట్ పోలీసులు వాళ్లను అరెస్ట్ చేసి డ్రగ్స్, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

బీఎన్ రెడ్డి నగర్​లో నివాసం ఉంటున్న రాజస్థాన్​కు చెందిన శంకర్ లాల్, కరీంనగర్​లో నివాసం ఉంటున్న శర్వాన్​తో హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయించేవాడు. ఈ పప్పి స్ట్రా డ్రగ్.. నీళ్లు, లెమన్ వాటర్ లేదంటే పాలలో కలిపి తీసుకుంటారు. మోతాదుకు మించి ఈ డ్రగ్స్ తీసుకుంటే కోమాలోకి వెళ్తారని సీపీ సుధీర్ బాబు తెలిపారు.

 పరారీలో ఉన్న మోహన్ సింగ్, శంకర్​లాల్, శర్వాన్ ను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో పెట్టుకుని డ్రగ్స్ సప్లై చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఎస్​వోటీ డీసీపీ కె.మురళీధర్, అడిషనల్ డీసీపీ షాఖీర్ హుస్పేన్, ఇన్ స్పెక్టర్లు కీసర నాగరాజు, భాస్కర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.