అర్ధరాత్రి స్మశాన వాటికలో బాలికపై అత్యాచారం

దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తన తండ్రికి వైద్యం చేయిస్తానంటూ మైనర్ బాలిక(12)పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. మాయమాటలతో బాలికను అర్ధరాత్రి సమయంలో స్మశాన వాటికను రప్పించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఢిల్లీలోని కంఝవాలా ప్రాంతంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు 52 ఏళ్ల వ్యక్తి మహ్మద్ షరీఫ్‌గా గుర్తించారు. అతను స్థానికంగా నల్ల మాంత్రికుడిగా ప్రచారమవుతున్నట్లు తెలిపారు. బాధిత బాలిక తండ్రి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న విషయం ముందే తెలుసుకున్న నిందితుడు.. చేతబడి చేశారనే నెపంతో వారికి దగ్గరైనట్లు వెల్లడించారు. తంత్ర విద్యల పేరుతో బాలికను అర్ధరాత్రి సమయంలో స్మశాన వాటికకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.

అత్యాచారం తరువాత నిందితుడు బాలిక చేతిలో రూ.51 పెట్టి.. జరిగిన విషయాన్ని ఎవరికీ తెలియజేయవద్దని చెప్పాడు. కాదని చెప్తే బాలిక తండ్రి రక్తం కక్కుకొని చనిపోతాడని భయపెట్టాడు. ఇంటికొచ్చిన బాలిక అలసటగా కనిపించడంతో కుటుంబసభ్యులు ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తంత్రాల నెపంతో నల్ల మాంత్రికుడు తనపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు బాధిత బాలిక కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు కంజావాలా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మైనర్ బాలిక వాంగ్మూలం ఆధారంగా కంజావాలా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితునిపై బీఎన్ఎస్, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.