వదిలేసిన కారులో 52 కిలోల బంగారం..10 కోట్ల క్యాష్

  • భోపాల్​శివారు జంగల్​లో వదిలేసిన కారులో లభ్యం
  • స్వాధీనం చేసుకున్న పోలీసులు

భోపాల్: మధ్యప్రదేశ్​ రాష్ట్రం భోపాల్ శివారులోని అడవిలో వదిలేసిన పాత కారులోంచి 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల నగదును లోకాయుక్త పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ 40 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఇదంతా పొలిటీషియన్లు, బ్యూరోక్రాట్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందినదిగా అనుమానిస్తున్నారు. కారు గ్వాలియర్ నివాసి, మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ స్నేహితుడి పేరు మీద ఉన్నట్లుగా గుర్తించారు.

అధికారులతో బిల్డర్లు కుమ్మక్కు

ఇన్​కంట్యాక్స్ అధికారులు ఇప్పటికే భోపాల్​లోని పలువురు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇండ్లు, ఆఫీసులలో సోదాలు నిర్వహిస్తున్నారు. సౌరభ్ శర్మ ఇంట్లో గురువారం తనిఖీలు చేయగా ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు కనుగొన్నారు. కోటికిపైగా నగదు, కిలోన్నర గోల్డ్, వజ్రాలు, వెండి కడ్డీలు, స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల నేపథ్యంలో పెద్ద మొత్తంలో బంగారం, నగదు రవాణా చేస్తున్నట్లు సమాచారం అందటంతో ఐటీ అధికారులు, లోకాయుక్త పోలీసులు 100 మంది కలిసి 30 కార్లలో వెళ్లి అడవిలో పాతకారును పట్టుకున్నారు.

ఆ కారులో దొరికిన 52 కిలోల బంగారం, క్యాష్ కూడా శర్మనే తరలిస్తున్నాడనే కోణంలో లోకాయుక్త దర్యాప్తు చేపట్టింది. భోపాల్​లో జరిగిన తనిఖీల్లో త్రిశూల్ కన్​స్ట్రక్షన్స్ కు చెందిన రాజేశ్ శర్మతోపాటు, పలువురు బిల్డర్ల వద్ద  ఉన్న అక్రమాస్తులకు సంబంధించిన ఎవిడెన్సులను పోలీసులు ఇదివరకే స్వాధీనం చేసుకున్నారు. ఆ బిల్డర్లందరూ పొలిటీషియన్లు, ఉన్నతాధికారులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు.