ఐదేండ్లలో 50 కొత్త ఎయిర్ పోర్టులు

  • కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి 

శంషాబాద్, వెలుగు: వచ్చే ఐదేండ్లలో దేశవ్యాప్తంగా 50 కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ‘‘హవాయి చెప్పల్ సే హవాయి సఫర్” అనే నినాదంతో విమానయాన శాఖ పని చేస్తోందని చెప్పారు. బుధవారం శంషాబాద్​ఎయిర్ పోర్టులో ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ ఫాంను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభించడం ఒక మైలు రాయి అని అభివర్ణించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో విమానయాన శాఖ వేగంగా పురోగతి సాధిస్తోందని తెలిపారు. దేశంలోని ప్రతీ ఎయిర్ పోర్టును అధునాతనంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రపంచం మొత్తం ఇండియన్ ఎయిర్ పోర్టుల వైపు చూసేలా చేస్తామన్నారు. ఏటేటా విమానాల్లో ప్రయాణిచించే వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉందని మంత్రి తెలిపారు. ప్రయాణికులు మన దేవుళ్లని వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదని ఎయిర్ పోర్టు సిబ్బందికి సూచించారు. చెక్ ఇన్, చెక్ అవుట్ వంటివి తక్కువ టైంలోనే చేసేందుకు కృషి చేయాలని  చెప్పారు. వరంగల్, భోగాపురం ఎయిర్ పోర్టులను పూర్తి చేయడంపై తాము దృష్టి సారించామన్నారు. ఏపీలోని భోగాపురం ఎయిర్ పోర్టు 2026 జూన్ వరకు పూర్తి అవుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఎయిర్ పోర్టు సీఈఓ ప్రదీప్ ఫణిక్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.