పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు గట్టి షాక్ తగిలింది. మూడు నెలల కిందట ఆ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే లావూ మామ్లేదార్తోపాటు మరో నలుగురు లీడర్లు రాజీనామా చేశారు. గోవా నుంచి టీఎంసీలో చేరిన తొలి లీడర్లలో లావూ మామ్లేదార్ కీలక నేత. ఓట్ల కోసం గోవాలో హిందువులు, క్రిస్టియన్ల మధ్య మత ఘర్షణలు సృష్టించేందుకు టీఎంసీ ప్రయత్నిస్తున్నదని రాజీనామా అనంతరం ఆయన ఆరోపించారు. బెంగాల్లో మమత చేస్తున్న పనులు నచ్చి, సెక్యులర్ పార్టీగా భావించి మూడు నెలల కింద టీఎంసీలో చేరానని, అయితే ఇరవై రోజుల కింద నిజస్వరూపం గ్రహించానని అన్నారు. బీజేపీకన్నా దారుణమైన పార్టీ టీఎంసీ అని, అది కమ్యూనల్ పార్టీ అని మామ్లేదార్ ఆరోపించారు. అధికారంలోకి వస్తే గృహ లక్ష్మి పథకం ప్రతి మహిళలకు రూ. 5వేలు ఇస్తామంటూ గోవాలోని మహిళల ఓట్లను రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. పోండా నియోజకవర్గం నుంచి మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ) తరఫున 2012 నుంచి 2017 వరకు లావూ మామ్లేదార్ ఎమ్మెల్యేగా కొనసాగారు. సెప్టెంబర్లో ఈయనతోపాటు రామ్ మంద్రేకర్, కిషోర్ పర్వార్, కోమల్ పర్వార్, సుజయ్ మల్లిక్ టీఎంసీలో చేరినప్పుడు తాము గోవాలోని మొత్తం 40 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ.. ఇంతలోనే ఈ ఐదుగురు రాజీనామా చేయడంతో టీఎంసీ షాక్ తగిలినట్లైంది.
