ఐదుగురు ఎంపీలకు సంసద్ రత్న

ఐదుగురు ఎంపీలకు సంసద్ రత్న

న్యూఢిల్లీ: ఉత్తమ పనితీరు కనబరిచిన పార్లమెంటేరియన్లకు ఏటా ఇచ్చే సంసద్ రత్న అవార్డులకు ఐదుగురు ఎంపీలు ఎంపికయ్యారు. 2023 ఏడాదికి బీజేపీకి చెందిన ఇద్దరుఎంపీలు సుకాంత మజుందార్, సుధీర్ గుప్తా, కాంగ్రెస్‌‌కు చెందిన కుల్దీప్ రాయ్ శర్మ, శివసేనకు చెందిన శ్రీకాంత్ ఏక్​నాథ్ షిండే, ఎన్‌‌సీపీకి చెందిన అమోల్ రాంసింగ్ కోల్హే ఈ అవార్డులు అందుకోనున్నారు. ఫిబ్రవరి 17న ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో వీరికి అవార్డులు అందజేయనున్నారు.

మాజీ ప్రెసిడెంట్​ అబ్దుల్ కలాం సూచన మేరకు చెన్నైకి చెందిన నాన్-ప్రాఫిట్ చారిటబుల్ ట్రస్ట్.. ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఈ అవార్డులను అంజేస్తున్నది. 2010లో ఆయన చేతులమీదుగా చెన్నైలో మొదటి అవార్డు కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ కె శ్రీనివాసన్ మాట్లాడుతూ న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తి అధ్యక్షతన విశిష్ట జ్యూరీ కమిటీ ఎంపీలను ఎంపిక చేస్తుందని తెలిపారు.

లోక్‌‌సభ, రాజ్యసభ వెబ్‌‌సైట్‌‌లు, పీఆర్​ఎస్​ లెజిస్లేటివ్ రీసెర్చ్ నుంచి ఎంపీ సమగ్ర పనితీరు వివరాలు తీసుకొని ఎంపిక చేసినట్లు  చెప్పారు. అవార్డు గ్రహీతలందరు చర్చలు, బిల్లుల సమయంలో పార్లమెంటులో వారు లేవనెత్తిన ప్రశ్నలు, వాటిని వ్యక్తం చేసిన తీరు ఆధారంగా జ్యూరీ పారదర్శకంగా ఎంపిక చేసిందని తెలిపారు.