లబ్ధిదారులకు ఒకేరోజు 5.21 లక్షల ఇండ్లు

లబ్ధిదారులకు ఒకేరోజు 5.21 లక్షల ఇండ్లు
  • మధ్యప్రదేశ్‌‌లో పంపిణీ ప్రారంభించిన ప్రధాని మోడీ
  •     పేదలకు ఇండ్లు ఇవ్వడం మాకు చాలా ముఖ్యమైన అంశం
  •     పీఎంఏవై కింద దేశంలో 2.5 కోట్ల ఇండ్లు కట్టించినం
  •     ఫ్రీ రేషన్ కోసం వచ్చే 6 నెలల్లో మరో రూ.80 వేల కోట్లు ఖర్చు చేస్తం

భోపాల్/న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (పీఎంఏవై–జీ) కింద మధ్యప్రదేశ్‌‌లో నిర్మించిన 5.21 లక్షల ఇండ్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మంగళవారం ఇండ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన ‘గృహ ప్రవేశం’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌‌ ద్వారా ఆయన మాట్లాడారు. మహిళలకు ఇండ్ల యాజమాన్య హక్కులు ఇవ్వడం వల్ల.. వారు ఎంపవర్ అయ్యారని, కుటుంబ ఆర్థిక విషయాల్లో వారి మాటలకు విలువ పెరిగిందని చెప్పారు. పేదలకు ఇండ్లు ఇవ్వడం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని తెలిపారు. పీఎంఏవై కింద దేశవ్యాప్తంగా 2.5 కోట్ల ఇండ్లు కట్టించినట్లు వెల్లడించారు. ఇందులో 2 కోట్లకు పైగా ఇండ్లకు మహిళలు సహయజమానులుగా ఉన్నారని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌‌కు 30.5 లక్షల ఇండ్లు కేటాయించగా.. ఇప్పటిదాకా 24 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, ఇందులో గిరిజన లబ్ధిదారులు కూడా ఉన్నారని వివరించారు. మధ్యప్రదేశ్‌‌తోపాటు దేశ విదేశాల్లో ఉన్న యూనివర్సిటీలు.. పీఎంఏవై కింద జరిగిన మహిళా సాధికారతను ఒక కేస్‌‌ స్టడీగా తీసుకోవాలని సూచించారు.

పథకం మాత్రమే కాదు.. కమిట్‌‌మెంట్

పేదలకు పక్కా ఇండ్లు కట్టివ్వాలన్నది ప్రభుత్వ పథకం మాత్రమే కాదని.. పేదరికం నుంచి బయటపడేస్తామని పేదలకు కాన్ఫిడెన్స్‌‌ ఇవ్వాలన్న కమిట్‌‌మెంట్ అని మోడీ చెప్పారు. గత ప్రభుత్వాలు నాలుగు కోట్ల నకిలీ రేషన్‌‌ కార్డులను ఉపయోగించి పేదలకు అందాల్సిన ప్రయోజనాలను పక్కదారి పట్టించాయని ఆరోపించారు. పక్కదారి పట్టించిన రేషన్‌‌ను మార్కెట్‌‌లో అమ్ముకుని, బ్లాక్ అకౌంట్లలో జమ చేసుకున్నారన్నారని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం.. నకిలీ కార్డులను తొలగించిందన్నారు. కరోనా టైంలో పేదలకు రేషన్ ఇచ్చేందుకు రూ.2.6 లక్షల కోట్లను తమ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. రానున్న 6 నెలల్లో మరో రూ.80 వేల కోట్లను వెచ్చిస్తామన్నారు. గతంలో ప్రజల సొమ్మును దోచుకున్న వాళ్లు.. ఇప్పుడు ఈ పథకాన్ని ఎగతాళి చేస్తున్నారని, అసత్యాలతో గందరగోళం సృష్టిస్తున్నారని ఫైర్‌‌‌‌ అయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం శివరాజ్‌‌ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.

పథకాల గురించి ప్రజలకు చెప్పండి

బీజేపీ వ్యవస్థాపక దినమైన ఏప్రిల్ 6 నుంచి ‘సామాజిక్ న్యాయ పఖ్వాడా (సామాజిక న్యాయం కోసం 15 రోజులు అంకితం)’ కింద పలు కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ సూచించారు. ప్రతి ప్రధాన మంత్రి సేవలను గుర్తించి, వారి జ్ఞాపకార్థం మ్యూజియాలు నిర్మించిన ఏకైక రూలింగ్ పార్టీ బీజేపీనే అని చెప్పారు. ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లాలని, వారి సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు పథకాలను వివరించాలని చెప్పారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌‌లో మోడీ మాట్లాడారు. ఇండ్లు, పౌష్టికాహారం, ఫ్రీ రేషన్‌‌ గురించి ప్రజలకు వివరించాల ని ప్రధాని సూచించినట్లు కేంద్ర మంత్రి అర్జున్‌‌రామ్ మేఘ్వాల్ చెప్పారు.