తెలంగాణ కిచెన్ : దిల్​ ఆకులతో చేసే కొన్ని వంటకాలు

‘దిల్​’ను ఇండియాలో ‘సోయ, సావా, సోవా’ అని పిలుస్తారు. చిన్నగా, సన్నగా ఉండే ఈ ఆకులను పిజ్జా, బర్గర్, సలాడ్స్​లో ఎక్కువగా వాడతారు. చూడటానికి కొత్తిమీరలా కనిపించే దిల్​ ఆకుల్లో విటమిన్ –సి, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ ఆకు  కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. చక్కెర వ్యాధిని కంట్రోల్​లో ఉంచుతుంది. నెలసరి, ప్రసవ నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. వీటితో పాటు ఇంకా బోలెడు ఆరోగ్యప్రయోజనాలు ఉన్న దిల్​ ఆకులను మనం వండుకునే మిగతా ఆకుకూరల్లాగే  రోజువారీ వంటల్లో వాడితే హెల్దీగా ఉండొచ్చు. దిల్​ ఆకులతో చేసే కొన్ని వంటకాలు ఇవి...

పకోడీ 

కావాల్సినవి :

దిల్​ ఆకులు (తరుగు) : రెండు కప్పులు 
శెనగపిండి, బియ్యప్పిండి : ఒక్కో కప్పు చొప్పున  
కొత్తిమీర, కరివేపాకు : కొద్దిగా 
పచ్చిమిర్చి : రెండు 
ఉల్లిగడ్డ : ఒకటి 
అల్లం తరుగు : అర టీస్పూన్  
వాము :  ఒక టీస్పూన్ 
కారం : అర టీస్పూన్ 
పసుపు : పావు టీస్పూన్  
ఉప్పు, నీళ్లు, నూనె : సరిపడా

తయారీ : ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యప్పిండి, అల్లం తరుగు, కరివేపాకు, కొత్తిమీర, వాము, ఉల్లిగడ్డ తరుగు, కారం, పసుపు, ఉప్పు వేయాలి. ఈ మిశ్రమంలో నీళ్లు పోస్తూ పకోడీ పిండిలా కలపాలి. నూనె వేడి చేసి పిండిని పకోడీల్లా వేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు పకోడీలను వేగించాలి.  వేగిన పకోడీలను ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి. చల్లారాక నచ్చిన చట్నీ లేదా కెచెప్​తో తింటే టేస్టీగా ఉంటాయి దిల్​ ఆకు పకోడీలు. వీటిని సాయంత్రం పూట శ్నాక్స్​​లా చేసుకోవచ్చు. 

దిల్​ ఆకులతో శ్నాక్

కావాల్సినవి :

దిల్​ ఆకులు (తరుగు) : ఒక కప్పు 
గోధుమపిండి : రెండు కప్పులు 
జీలకర్ర, మిరియాల పొడి, నెయ్యి : ఒక్కో టీస్పూన్
పసుపు : పావు టీస్పూన్
ఉప్పు, నూనె : సరిపడా
నూనె : మూడు టేబుల్ స్పూన్లు

తయారీ : ఒక గిన్నెలో గోధుమపిండి, మిరియాల పొడి, పసుపు, ఉప్పు, నెయ్యి, దిల్​ ఆకుల తరుగు వేయాలి. అందులో నీళ్లు పోసి బాగా కలపాలి. చపాతి ముద్దలాగ కలిపాక, నూనె వేసి మరికాసేపు కలిపి మూతపెట్టాలి. ఐదు నిమిషాలయ్యాక చిన్న ఉండలు చేయాలి. ఒక్కో ఉండను చపాతీలా వత్తాలి. ఒక గ్లాస్​ తీసుకుని దాంతో గుండ్రంగా కట్ చేయాలి. నూనె వేడి చేసి అందులో గుండ్రంగా కట్ చేసిన చపాతీలను వేగించాలి. చల్లారాక వీటిని గాలిచొరబడని గాజు సీసాలో పెడితే నెలరోజులు వరకు తాజా​గా ఉండటమే కాదు కరకరలాడుతుంటాయి కూడా.

దిల్​ ఆకుతో కోడిగుడ్ల కూర

కావాల్సినవి :

పచ్చి కొబ్బరి ముక్కలు : పావు కప్పు
ఉల్లిగడ్డ, టొమాటో : ఒక్కోటి
దిల్​ ఆకులు (తరుగు) : ఒక కప్పు
కొత్తిమీర : అర కప్పు
దాల్చిన చెక్క : ఒకటి
లవంగాలు : నాలుగు
సోంపు : ఒక టేబుల్ స్పూన్
ధనియాల పొడి : ఒక టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు : ఐదు
అల్లం : చిన్న ముక్క
నీళ్లు : పావు కప్పు 

గ్రేవీ కోసం :

 కోడిగుడ్లు : నాలుగు
నూనె : ఐదు టేబుల్ స్పూన్లు
ఆవాలు : అర టేబుల్ స్పూన్
ఉల్లిగడ్డ : ఒకటి (చిన్నది)
ఉప్పు : సరిపడా
నీళ్లు : ఒక కప్పు

తయారీ : ఉల్లిగడ్డ, టొమాటో తరుగు, పచ్చి కొబ్బరి ముక్కలు, సోయకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి మిక్సీజార్​లో వేయాలి. నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ప్రెషర్ కుక్కర్​లో నూనె వేడి చేసి ఆవాలు, ఉల్లిగడ్డ తరుగు వేగించాలి.  అందులో గ్రైండ్ చేసిన పేస్ట్ వేయాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. కొన్ని నీళ్లు పోసి చిన్న మంట మీద బాగా మరిగించాలి. తరువాత కోడిగుడ్ల సొనను అందులో కార్చాలి. మూతపెట్టి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. దిల్​ ఆకును కోడిగుడ్లతో కలిపి చేసిన గ్రేవీ కర్రీ చపాతీల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది.

ఓట్స్​ : పరాటా

కావాల్సినవి :

దిల్​ ఆకులు : ఒక కప్పు 
వెన్న : ఒక టీస్పూన్
పచ్చిమిర్చి : ఒకటి  
జీలకర్ర పొడి, ధనియాలపొడి : ఒక్కోటి పావు  టీస్పూన్  చొప్పున
ఉప్పు : సరిపడా
ఉల్లిగడ్డ తరుగు : అర కప్పు
ఓట్స్ : ఒక టేబుల్ స్పూన్ 
గోధుమపిండి : ఒక కప్పు 
నూనె : ఒక టీస్పూన్
నీళ్లు : ఒక కప్పు

తయారీ : గోధుమపిండిలో ఉప్పు వేసి, నీళ్లు పోసి ముద్దగా కలపాలి. చివరగా కొంచెం నూనె వేసి మరోసారి మెత్తగా కలిపి పక్కన పెట్టాలి.  వెన్న వేడి చేసి అందులో దిల్​ ఆకుల తరుగు వేగించాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, ధనియాల పొడి కలపాలి. ఉప్పు, చిన్నముక్కలుగా తరిగిన ఉల్లిగడ్డ అందులో వేసి వేగించాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి అందులో ఓట్స్  వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని చిన్న ఉండలు చేయాలి. రెడీ చేసిన గోధుమపిండి ముద్దను ఉండలు చేయాలి. ఆ ఉండల్ని  అరచేతి సైజులో చపాతీలా వత్తాలి. అందులో దిల్​ ఆకుల మిశ్రమం పెట్టి మళ్లీ ఉండలా చేసి  పరాటాలాగ వత్తాలి. వీటిని పాన్​ మీద నెయ్యితో కాల్చి తింటే టేస్టీగా ఉంటాయి.

పులావ్ 

కావాల్సినవి :

దిల్​ ఆకులు (తరుగు) : ఒక కప్పు
బాస్మతి బియ్యం : ఒకటిన్నర కప్పు
కొబ్బరి తురుము : అర కప్పు
లవంగాలు : రెండు
దాల్చినచెక్క : ఒకటి
మిరియాలు : పదిహేను
పచ్చిమిర్చి : నాలుగు
నూనె : ఒక టీస్పూన్
నెయ్యి : రెండు టీస్పూన్లు
జీలకర్ర : ఒక టీస్పూన్
జీడిపప్పులు : పది
ఉల్లిగడ్డ : ఒకటి
బిర్యానీ ఆకులు : రెండు
నీళ్లు : మూడు కప్పులు
పచ్చిబటానీలు : అర కప్పు
ఉప్పు : సరిపడా

తయారీ : బాస్మతీ బియ్యాన్ని కడిగి, నీళ్లు పోసి నానబెట్టాలి. మిక్సీజార్​లో కొబ్బరి తురుము, లవంగాలు, దాల్చినచెక్క, మిరియాలు, పచ్చిమిర్చి వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత అందులోనే దిల్​ ఆకులను కూడా వేసి మరోసారి మిక్సీలో గ్రైండ్​ చేయాలి. ప్రెషర్​ కుక్కర్​లో నెయ్యి, నూనె వేడి చేసి అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, జీడిపప్పులు వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ తరుగు కూడా వేసి కాసేపు వేగించాలి. అవి వేగాక గ్రైండ్ చేసిన మిశ్రమం, దిల్​ ఆకుల తరుగు కూడా వేసి కలపాలి. నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని అందులో వేయాలి. ఒకసారి గరిటెతో కలిపి, నీళ్లు పోయాలి. తరువాత పచ్చిబటానీలు కూడా వేశాక సరిపడా ఉప్పు వేసి మరోసారి కలపాలి. కావాలంటే మరో స్పూన్ నెయ్యి  వేసి, మూతపెట్టాలి. ఒక విజిల్ వచ్చాక కుక్కర్​ మూత తీసి మొత్తాన్ని ఒకసారి కలిపితే  వేడి వేడి పులావ్​ తినడానికి రెడీ.