న్యూఢిల్లీ: చివరి రోజు దగ్గరవుతుండటంతో డిసెంబర్ 28 ఒక్క రోజే 18.89 లక్షల రిటర్నులు ఫైలయినట్లు ఐటీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. 2020–21 ఫైనాన్షియల్ ఇయర్‌కు ఇప్పటిదాకా ఫైలయిన రిటర్నుల సంఖ్య దీంతో మొత్తం 4.86 కోట్లకు చేరినట్లు తెలిపింది. ఇండివిడ్యువల్స్‌కు ఐటీ రిటర్నుల ఫైలింగ్ గడువును ఈ ఏడాది అయిదు నెలలు పొడగించిన విషయం తెలిసిందే. ఈ గడువు డిసెంబర్ 31 తో ముగియనుంది. అంతకు ముందు ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం 5.95 కోట్ల ఐటీ రిటర్నులు ఫైలయ్యాయి.
ఈ–వెరిఫికేషన్ గడువు పెరిగింది....
ఫైనాన్షియల్ ఇయర్ 2019–20 కి ఫైల్ చేసిన ఐటీ రిటర్నుల ఈ– వెరిఫికేషన్ ప్రాసెస్‌కు ఫిబ్రవరి 28, 2022 దాకా అవకాశం ఇస్తున్నట్లు ఐటీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఆన్లైన్లో ఐటీ రిటర్ను ఫైల్ చేశాక, ఆధార్ ఓటీపీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ–వెరిఫికేషన్ చేయాలనే విషయం తెలిసిందే. రిటర్ను ఫైల్ చేసిన 120 రోజుల లోపు ఈ–వెరిఫికేషన్ పూర్తవ్వాలి. ఒకవేళ ఇలా కాకుంటే, బెంగళూరులోని సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)కి ఫైల్ చేసిన ఐటీఆర్ ఫిజికల్ కాపీని పంపించొచ్చు. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి కాకపోతే రిటర్ను ఫైల్ చేయనట్లుగానే పరిగణిస్తారు. ఫిబ్రవరి నెలాఖరు లోపు ఈ–వెరిఫికషన్ ప్రాసెస్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందిగా ఎసెసీలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) సూచించింది.
