46 తులాల బంగారం చోరీ..ఇంట్లో అందరూ ఉండగానే దోచుకెళ్లిన దొంగలు

  • సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఘటన

రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని సాయినగర్  కాలనీలో ఆదివారం తెల్లావారుజామున భారీ చోరీ జరిగింది. ఇంట్లో అందరూ పడుకొని ఉండగానే 46 తులాల బంగారం, వెండి, నగదు చోరీకి గురయ్యాయి. బాధితుడు వేణుగోపాల్ రావు సైబరాబాద్​కమిషనరేట్  రామచంద్రాపురంలోని సాయినగర్​కాలనీలో తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. శనివారం రాత్రి భార్య, కుటుంబ సభ్యులు ఎవరి గదుల్లో వారు పడుకున్నారు. అల్మారా ఉన్న గదిలోకి ప్రవేశించిన ఓ దొంగ.. అందులోని 46 తులాల బంగారు నగలు, 20 తులాల వెండి, రూ.10 వేలు ఎత్తుకెళ్లాడు.

‘‘ఆదివారం తెల్లావారుజామున మేమంతా గాఢ నిద్రలో ఉన్నాం. దొంగ మెయిన్​డోర్​ పక్కనున్న కిటికీ తెరిచి ఇంట్లోకి వచ్చాడు. పోలీస్​ డాగ్స్​ వాసనను పసిగట్టకుండా ఉండాలని అక్కడి వస్తువులపై కారం చల్లి వెళ్లాడు’’ అని వేణుగోపాల్  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్​ టీం చోరీపై అనుమానాలు వ్యక్తం చేశాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని రామచంద్రాపురం పోలీసులు తెలిపారు.