స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్.. నలుగురు ఉద్యోగులు మృతి

స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్.. నలుగురు ఉద్యోగులు మృతి
ఒడిశాలోని ఓ ప్రభుత్వ సంస్థ‌(స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) లో ఘోర‌ ప్రమాదం జరిగింది. రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీకై విష వాయువులు వెలువ‌డ‌డంతో నలుగురు కాంట్రాక్టు ఉద్యోగులు మరణించారు. మరికొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వారిని హుటాహుటిన ఇస్పత్ జనరల్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్ కెమికల్ డిపార్ట్‌మెంట్‌లో ఉదయం పెద్ద ఎత్తున కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీకయింది. ఆ సమయంలో డ్యూటీలో 10 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. విష వాయువులను పీల్చి అపస్మాకర స్థితిలోకి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. చెల్లా చెదురుగా పడిపోయిన ఉద్యోగులను ఆస్పత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఇద్దరు మరణించగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో 8 మందికి చికిత్స కొనసాగుతోంది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.