సంగారెడ్డి జిల్లాలో నాలుగు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు లైన్ క్లియర్

  • సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 8 మున్సిపాలిటీలు 
  • బల్దియాలుగా అప్ గ్రేడ్ కానున్న ఇస్నాపూర్, కోహిర్, గడ్డపోతారం,  
  • గుమ్మడిదల మేజర్ పంచాయతీలు
  •  పటాన్ చెరు పరిధిలో 3, జహీరాబాద్ పరిధిలో ఒకటి
  •  కార్పొరేషన్ కానున్న సంగారెడ్డి? 

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో  4 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీలను అప్ గ్రేడ్ చేస్తూ వాటిని బల్దియాలుగా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో పటాన్ చెరు నియోజకవర్గంలో 3, జహీరాబాద్ పరిధిలో ఒక మున్సిపాలిటీ ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో ఇప్పటికే 8 మున్సిపాలిటీలు ఉండగా, కొత్తగా ఇస్నాపూర్, కోహిర్, గడ్డపోతారం, గుమ్మడిదల పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారబోతున్నాయి.

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చబోతోంది. సంగారెడ్డి గ్రేడ్ వన్ మున్సిపాలిటీని చుట్టుపక్కల గ్రామాలతో కలుపుతూ కార్పొరేషన్ చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే  11 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ తో జిల్లా రాజకీయ స్వరూపం మారనుంది.        

పటాన్ చెరులో... 

జీహెచ్ఎంసీలో ఇప్పటికే ఇక్కడి నుంచి పటాన్ చెరు, రామచంద్రపురం, భారతీ నగర్ మూడు డివిజన్లు, తెల్లాపూర్, అమీన్ పూర్, బొల్లారం మూడు మున్సిపాలిటీలు ఉండగా, ఇస్నాపూర్, గడ్డపోతారం, గుమ్మడిదల పంచాయతీలు కొత్త మున్సిపాలిటీలుగా మారనున్నాయి.  ఈ క్రమంలో పటాన్ చెరులో మూడు డివిజన్లు, ఆరు మున్సిపాలిటీలతో పారిశ్రామిక ప్రాంతం మరింత డెవలప్ కానుందనే టాక్ వినిపిస్తోంది.

Also Read :- స్కూళ్లల్లో ఇక టీచర్ల ఫొటోలు

గుమ్మడిదల మున్సిపాలిటీలో గుమ్మడిదలతో పాటు అన్నారం, బొంతపల్లి, దోమడుగు, వీరన్నగుడెం గ్రామాలు కలవనున్నాయి. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఇస్నాపూర్ తోపాటు పాశమైలారం, చిట్కుల్ గ్రామాలు కలవనుండగా, గడ్డపోతారం మున్సిపాలిటీలో ఆ గ్రామం తోపాటువావిలాల , ఖాజీపల్లి, నల్తుర్ గ్రామాలు కలవనున్నాయి.        

జహీరాబాద్ లో... 

జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ప్రస్తుతం ఒక జహీరాబాద్ మున్సిపాలిటీ మాత్రమే ఉంది. తాజాగా కోహిర్ మేజర్ గ్రామ పంచాయతీని గ్రేడ్ త్రీ మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఇక్కడ మున్సిపాలిటీల సంఖ్య రెండుకు చేరింది. 25 వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి కోహిర్ ఒక్క గ్రామాన్ని మున్సిపాలిటీగా మార్చాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది.

కోహిర్  కొత్త మున్సిపాలిటీలో ఒకవేళ గ్రామాలు కలపాల్సి వస్తే పక్కనే ఉన్న కొత్తూరు (కె), ఖానాపూర్ గ్రామాలను కలిపే ఛాన్స్ ఉంది. పారిశ్రామికంగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు మున్సిపాలిటీల పరంగా ప్రభుత్వ సేవలు మరింత అందనున్నాయి. కోహిర్ మున్సిపాలిటీగా ఏర్పడడం ఎంతో ముఖ్యమైనప్పటికీ అక్కడక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. 

 కార్పొరేషన్ కానున్న సంగారెడ్డి? 

జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీ కార్పొరేషన్ దిశగా అడుగులు వేస్తోంది. గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా ఉన్న సంగారెడ్డిలో రెండున్నర లక్షల జనాభా ఉండడంతో కార్పొరేషన్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి మున్సిపాలిటీకి పక్కన ఉన్న 11 గ్రామాలను కలుపుతూ కార్పొరేషన్ చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కంది, చిమ్నాపూర్, కొత్లాపూర్, అల్లూర్, మల్కాపూర్, నాగపూర్, కులబ్ గూర్, కల్పగూర్, చింతలపల్లి, అంగడిపేట్

ఫసల్వాది గ్రామాలను కలపాలనే ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ పూర్తి చేసి అందుకు తగిన ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది. ఒకవేళ సంగారెడ్డి మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మారితే సెంట్రల్ ఫండ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండడంతో మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారు.