న్యూఢిల్లీ: ఓవైపు చైనా.. మరోవైపు పాకిస్థాన్ తో బార్డర్ ఇష్యూస్ పెరుగుతున్న నేపథ్యంలో 2021–22 బడ్జెట్లో రక్షణ శాఖకు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మరింత ఇంపార్టెన్స్ ఇచ్చారు. డిఫెన్స్ కు ఓవరాల్ గా నిరుటి కంటే రూ. 7 వేల కోట్లను ఎక్కువగా కేటాయించారు. పోయిన బడ్జెట్ లో రూ. 4.71 లక్షల కోట్లను డిఫెన్స్ కు కేటాయించగా.. ఈసారి రూ. 4 లక్షల 78 వేల195 కోట్లను అలకేట్ చేశారు. మొత్తంగా నిరుటి కంటే డిఫెన్స్ బడ్జెట్ 1.4% మేరకు పెరిగింది. అయితే చైనా, పాక్ లతో ముప్పు పెరుగుతుండటంతో ఈసారి క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ ను ఏకంగా19% పెంచారు. గత 15 ఏళ్లలో డిఫెన్స్ కు క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ ఇదే అత్యధికమని నిర్మల ప్రకటించారు. దేశవ్యాప్తంగా కొత్తగా 100 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తం జీడీపీలో 1.63 శాతాన్ని డిఫెన్స్ కు కేటాయించారు.
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లకు ఇలా..
ఆర్మీకి రూ. 36,481 కోట్ల క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ ను కేటాయించారు. ఇది నిరుటి కంటే 3 వేల కోట్లు ఎక్కువ. నేవీకి మాత్రం గతేడాది కంటే రూ. 4 వేల కోట్లు తక్కువగా.. రూ. 33,253 కోట్లను అలకేట్ చేశారు. ఇక ఎయిర్ ఫోర్స్ కు కూడా కొత్త వెపన్స్, ప్లాట్ ఫాంల కొనుగోలు కోసం గతేడాది కంటే రూ. 1,840 కోట్లు తక్కువగా రూ. 53,214 కోట్లు కేటాయించారు. డీఆర్డీవోకు నిరుటి కంటే 8 శాతం ఎక్కువగా రూ. 11,375 కోట్లు అలకేట్ చేశారు. అలాగే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో)కు 7.48 శాతం పెంచి, రూ. 6,004 కోట్లు కేటాయించారు.
వెపన్స్ కొనుగోళ్లకు ప్రయారిటీ
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లకు కొత్త వెపన్స్, ఎయిర్ క్రాఫ్ట్ లు, వార్‌షిప్ లు, మిలటరీ హార్డ్ వేర్ ను కొనుగోలు చేసేందుకు వీలుగా రూ. 1.35 లక్షల కోట్లను కేటాయించారు. లడఖ్‌లో చైనా ఆక్రమణ, బార్డర్ లో టెన్షన్ తర్వాత.. నిరుటి బడ్జెట్ లో డిఫెన్స్ క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ ను కేంద్రం రూ. 1.13 లక్షల కోట్ల నుంచి రూ. 1.34 లక్షల కోట్లకు రివైజ్ చేసింది. దీనిని లెక్కలోకి తీసుకుంటే తాజా బడ్జెట్ లో 0.4 శాతమే కేటాయింపులు పెరిగాయి. అయితే రక్షణ శాఖలో మోడర్నైజేషన్ కోసం 2021– 2026 మధ్య రూ. 2.38 లక్షల కోట్లను నాన్ లాప్సెబుల్ ఫండ్ గా మెయింటెయిన్ చేయాలని, దీనికి ‘రాష్ట్రీయ సురక్షా నైవేద్యమ్ కోష్’గా పేరు పెట్టవచ్చని 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసింది. ఈ ఫండ్ కు ఏటా రూ. 51 వేల కోట్లకు మించకుండా కేటాయింపులు చేయాలని సూచించింది. ఈ మేరకు రూ. 2.38 లక్షల కోట్లతో ‘మోడర్నైజేషన్ ఫండ్ ఫర్ డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ’ పేరుతో నాన్ ల్యాప్సెబుల్ ఫండ్ ను కూడా కేంద్రం క్రియేట్ చేయనుంది.
చైనాతో టెన్షన్.. 20 వేల కోట్ల ఎక్స్ ట్రా ఖర్చు
లడఖ్బార్డర్ లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో రక్షణ శాఖకు నిరుడు కేటాయించిన బడ్జెట్ కన్నా అదనంగా రూ. 20,776 కోట్లను కేంద్రం ఎమర్జెన్సీ ఫండ్ కింద అదనంగా ఖర్చు చేసింది. పోయిన బడ్జెట్ లో సాయుధ బలగాలకు క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ కింద రూ. 1,13,734 కోట్లను కేంద్రం కేటాయించింది. తర్వాత దీనిని 1,34,510 కోట్లకు రివైజ్ చేసింది. లడఖ్ లో మోహరించిన సోల్జర్లకు యూనిఫామ్స్ నుంచి మిసైల్స్ వరకు అనేక రకాల ఎక్విప్ మెంట్, వెపన్స్ కొనుగోలు కోసం అదనంగా నిధులను ఖర్చు చేశారు. అమెరికా నుంచి వింటర్ క్లాత్స్, అసాల్ట్ రైఫిల్స్, రష్యా నుంచి మిసైళ్లు, అమ్యూనిషన్, రఫేల్, మిరేజ్ 2000 ఫైటర్ జెట్లలో వాడేందుకు అదనపు వెపన్స్ వంటివాటిని ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి కేంద్రం ఎమర్జెన్సీ ప్రాతిపదికన కొనుగోలు చేసింది.
చైనా డిఫెన్స్ బడ్జెట్ 13 లక్షల కోట్లు!
బార్డర్లో తీవ్ర ముప్పుగా మారిన చైనా డిఫెన్స్ బడ్జెట్ మనకంటే 3 రెట్లు ఎక్కువగా ఉంది. 2020లో చైనా మొత్తం179 బిలియన్ డాలర్లు (రూ.13 లక్షల కోట్లు) కేటాయించింది. నిరుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం బడ్జెట్ లో 15.5 శాతాన్ని డిఫెన్స్ కు కేటాయించింది. చైనా తన బడ్జెట్ లో 36.2 శాతం ఫండ్స్ ను డిఫెన్స్ కు అలకేట్ చేసింది. అయితే చైనా డిఫెన్స్ బడ్జెట్ 2019లో 175 బిలియన్ డాలర్లు అని అధికారికంగా వెల్లడించినప్పటికీ, నిజానికి 240 బిలియన్ డాలర్ల (రూ. 17 లక్షల కోట్లు) వరకూ ఉంటుందని స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) అంచనా. మరోవైపు కేంద్రం నిరుడు కూడా మన డిఫెన్స్ బడ్జెట్ ను పెంచినా.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మోడర్నైజేషన్ కు నిధులు సరిపడా అందలేదని నిపుణులు చెప్తున్నారు.
డిఫెన్స్‌లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంపు
డిఫెన్స్ మినిస్ట్రీలో శాలరీలతో సహా ఇతర రెవెన్యూ ఎక్స్ పెండిచర్ కింద రూ. 2.12 లక్షల కోట్లు, పెన్షన్ల కోసం రూ. 1.15 లక్షల కోట్లు అలకేట్ చేశారు. అయితే డిఫెన్స్ పెన్షన్ల కోసం నిరుటి (రూ.1.33 లక్షల కోట్లు) కంటే కేటాయింపులు తగ్గాయి. దీంతో డిఫెన్స్ లో రిటైర్ మెంట్ ఏజ్ పెంచే అవకాశాలు ఉన్నాయని ఎక్స్ పర్టులు విశ్లేషిస్తున్నారు. ఇక 2019-–20లో డిఫెన్స్ కు రూ. 4.30 లక్షల కోట్లు కేటాయించారు. వరుసగా రెండోసారి కేటాయింపులను పెంచారు. అయితే ఈసారి ఓవరాల్ గా డిఫెన్స్ కు కేటాయింపులు స్వల్పంగానే పెరిగినప్పటికీ, క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ ను భారీగా పెంచడం మంచి నిర్ణయమని ఎక్స్ పర్టులు అంచనా వేస్తున్నారు.
