భూతద్దంతో బొమ్మలేస్తున్నడు

భూతద్దంతో బొమ్మలేస్తున్నడు

పెన్సిల్‌‌, ఇసుక, బొగ్గుతో... లేదా త్రీడీ ఆర్ట్‌‌, ఆయిల్‌‌ పెయింటింగ్‌‌ ఇలా రకరకాల డ్రాయింగ్స్‌‌ చూస్తుంటారు. కానీ, ఇవేవీ కాకుండా, వీటి అవసరం లేకుండా అచ్చుగుద్దినట్టు అన్నిరకాల బొమ్మలేయడం ఎప్పుడైనా చూశారా? ‘సన్‌‌లైట్‌‌ వుడ్‌‌ బర్నింగ్‌‌ ఆర్ట్‌‌’ అనే  ఒక కొత్త కళ నేర్చుకొని, చెక్కపైన బొమ్మలేస్తూ  వైరల్‌‌ అవుతున్నాడు విఘ్నేష్‌‌.

తమిళనాడులోని మయిలాదుతురై అనే ఊళ్లో ఉంటాడు 31 ఏండ్ల విఘ్నేష్‌‌. చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం అంటే ఇంట్రెస్ట్‌‌ ఉన్నా దాన్ని ఎక్కువ పట్టించుకోలేదు ఇతను. బీటెక్‌‌ పూర్తిచేసి ఇంజనీరింగ్‌‌ జాబ్‌‌ కూడా చేశాడు. తరువాత కొన్ని రోజులకి అనారోగ్య సమస్యలు వచ్చి నెల రోజులు మంచానపడ్డాడు. అప్పుడే జాబ్‌‌పోయి డిప్రెషన్‌‌లోకి వెళ్లిపోయాడు. కొన్ని రోజులు ఖాళీగా ఉండి మళ్లీ బొమ్మలేయడం మొదలుపెట్టాడు. పెన్సిల్‌‌తో మనుషుల డ్రాయింగ్‌‌ వేసి అమ్మేవాడు. అవి అమ్మితే వచ్చిన డబ్బుతో ఇల్లు గడవడం ఇబ్బందిగా మారింది. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. 

ఇన్‌‌స్టాగ్రామ్‌‌ రీల్స్‌‌ చూసి..

కాలిఫోర్నియాలోని మైఖేల్‌‌ పపడాకిస్ అనే వ్యక్తి భూతద్దంతో చెక్కపైన సూర్యకిరణాలు పడేలాచేసి ఆ చెక్కను కాల్చి బొమ్మలు గీసేవాడు. మైఖేల్‌‌ ఆర్ట్‌‌ వీడియోలను ఇన్‌‌స్టాగ్రామ్​లో చూసిన విఘ్నేష్‌‌ అతనిలా ట్రై చేయాలనుకున్నాడు. మొదట్లో చెక్కమీద పేర్లు రాయడం ప్రాక్టీస్‌‌ చేశాడు. దాంట్లో నైపుణ్యం రాగానే బొమ్మలు వేయడం మొదలుపెట్టాడు. అలా ఇప్పటివరకు రకరకాల బొమ్మల్ని సన్‌‌లైట్‌‌ వుడ్‌‌ బర్నింగ్‌‌ ఆర్ట్‌‌ ద్వారా చెక్కాడు విఘ్నేష్‌‌. ఈ ఆర్ట్‌‌ వేయడానికి దాదాపు రెండు రోజుల టైం పడుతుందట. ఇవే కాకుండా పెన్సిల్‌‌ ఆర్ట్‌‌, 3డి ఆర్ట్‌‌లు కూడా వేస్తున్నాడు. ఈ మధ్య సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌ అయిన ఫిల్టర్‌‌‌‌ కాఫీ 3డి డ్రాయింగ్‌‌ ఇమేజ్‌‌ విఘ్నేష్​ గీసిందే. ఇతను గీసిన బొమ్మలు, ఆయిల్‌‌ పెయింటింగ్స్‌‌, సన్‌‌లైట్‌‌ వుడ్‌‌ బర్నింగ్‌‌ ఆర్ట్‌‌లు నచ్చి పెండ్లిళ్లకు, బర్త్‌‌డే పార్టీలకు గిఫ్ట్‌‌ ఇవ్వడానికి ఆర్డర్స్‌‌ ఇస్తున్నారు. చాలారకాల అవార్డ్‌‌లు కూడా అందుకున్నాడు. 

‘చిన్నప్పుడు కాగితాన్ని భూతద్దంతో కాల్చి ఆడినప్పుడు దాంతో కొత్త ఆర్ట్‌‌ తయారు      చేయొచ్చని అనుకోలేదు. మొదట్లో నా డ్రాయింగ్స్‌‌ను 500 నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్మేవాడ్ని. ఇప్పుడు ఆర్డర్స్‌‌ పెరిగాయి. రేట్‌‌ కూడా పెంచాను. నలుగురికీ ఈ ఆర్ట్‌‌ నేర్పిస్తున్నా. ప్రస్తుతం ఇల్లు బాగానే  గడుస్తోంది. అవకాశం ఇస్తే గవర్నమెంట్‌‌ స్కూల్స్‌‌లో ఫ్రీగా ఈ ఆర్ట్‌‌ ఎలా వేయాలో స్టూడెంట్స్‌‌కు నేర్పిస్తా’ అంటున్నాడు విఘ్నేష్‌‌.