తొమ్మిది రోజులుగా బోరు బావిలోనే చిన్నారి

  • రాజస్థాన్​లో బోరు బావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి చేతన
  • కాలంతో పోటీ పడుతూ కాపాడేందుకు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్

జైపూర్: మూడేళ్ల చిన్నారి చేతన తండ్రితో పాటు పొలానికి వెళ్లింది.. తండ్రి పనిలో నిమగ్నం కాగా చేతన పక్కనే ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. రాజస్థాన్ లోని కోట్ పుట్లి బెహ్రార్ జిల్లాలో ఈ నెల 23న ఈ ఘటన చోటుచేసుకుంది. చేతన తండ్రి సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. అయితే, రోజులు గడుస్తున్నా చేతనను బయటకు తీసుకురాలేకపోయాయి. బోరుబావికి సమాంతరంగా మరో బావి తవ్వి చేతనను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం చేస్తున్న ప్రయత్నానికి రాయి అడ్డు తగిలింది. దానిని తొలగించేందుకు బ్లాస్ట్ చేస్తే చిన్నారికి హాని కలుగుతుందనే కారణంతో పలుగు, పార, డ్రిల్లింగ్​ మెషిన్లతోనే పనిచేస్తున్నారు. దీంతో రెస్క్యూ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. అయినప్పటికీ రెస్క్యూ సిబ్బంది పట్టువదలకుండా శ్రమిస్తున్నారు. 

రెస్క్యూ పనులు మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క నిమిషం కూడా రెస్క్యూ పనులు ఆపేయలేదని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. మంగళవారం నాటికి చేతన బోరుబావిలో పడి 9 రోజులు గడిచాయి.. అయినా సహాయక సిబ్బంది పాపను బయటకు తీసుకురాలేక పోయారు. సమయం గడుస్తున్న కొద్దీ పాప ప్రాణాలతో బయటపడే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తొమ్మిది రోజులు గడవడంతో ఆహారం, నీళ్లు లేక పాప ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా మారి ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఈ క్రమంలోనే తన బిడ్డను కాపాడాలంటూ చేతన తల్లి కన్నీళ్లతో ప్రాధేయపడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీలైనంత త్వరగా తన బిడ్డను బయటకు తీసుకురావాలని చేతన తల్లి అధికారులను వేడుకుంటోంది.