ఆడవాళ్లలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు ఇవే.. గుర్తించడం ఎలా?

ఆడవాళ్లలో బ్రెస్ట్, సర్విక్స్, ఒవేరియన్... ఈ మూడు రకాల క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇవి ఎక్కువగా ఎందుకొస్తున్నాయంటే.. బ్రెస్ట్ క్యాన్సర్.. రావడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉంటున్నాయి. వాటిలో ఒకటి జన్యుపరంగా, రెండోది సరైన ఆహారం తినకపోవడం. పిల్లలు కలగని, ఆలస్యంగా కలిగిన వాళ్లలో కూడా ఈ క్యాన్సర్​ రిస్క్​ ఉంటోంది. ఈ కారణాలకు తోడు పొల్యూషన్ కూడా బ్రెస్ట్​ క్యాన్సర్​కు కారణం అవుతోంది. అయితే బ్రెస్ట్ క్యాన్సర్​ను గుర్తించడం చాలా ఈజీ. బ్రెస్ట్​లో లంప్స్(గడ్డలు) ఉన్నా, చనుమొనల నుంచి సెక్రేషన్స్(స్రావాలు) వచ్చినా వెంటనే కనిపెట్టొచ్చు. 

అలాగే క్యాన్సర్​ వచ్చిందని తెలిశాక కంగారు పడాల్సిన అవసరం లేదు. హై క్వాలిటీ ట్రీట్​మెంట్ అందుబాటులో ఉంది. అలాగే ముందుగానే గుర్తించేందుకు కొన్ని టెస్ట్​లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్​లో బీఆర్​సీ1 లేదా2 పాజిటివ్ వచ్చినవాళ్లలో తల్లి నుంచి పిల్లలకు వస్తే ప్రొఫైలాక్టిక్​ లేదా క్యాన్సర్ ప్రివెంటివ్ సర్జరీలు చేస్తారు. క్యాన్సర్​ రావడానికి కారణాలు కనుక్కుంటే వాటికి తగ్గ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. 

ఒవేరియన్ క్యాన్సర్.. ఇన్​ఫెర్టిలిటీ వల్ల వస్తుంది. ప్రెగ్నెన్సీ లేటుగా రావడం, ప్రెగ్నెన్సీ కోసం చేసే ట్రీట్​మెంట్​ వల్ల ఓవరీస్​ స్టిమ్యులేట్ అవుతాయి. దానివల్ల కూడా ఒవేరియన్​ క్యాన్సర్​ బారిన పడే అవకాశం ఉంది. వీటిని మాత్రం డాక్టర్లే కనుక్కోగలరు. టీనేజర్స్ విషయానికి వస్తే క్యాన్సర్ సెల్స్  అగ్రెసివ్​గా ఉంటాయి. కాబట్టి వెంటనే విపరీతంగా పెరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వెంటనే ట్రీట్​మెంట్ తీసుకోవాలి. 

సర్వైకల్ క్యాన్సర్​.. ఇది హ్యూమన్​ పాపిలోమా వైరస్ (హెచ్​పీవీ) ఇన్​ఫెక్షన్ వల్ల వస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే హెచ్​పీవీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వీనల్, వెజైనల్, తల, మెడ వంటి భాగాల్లో వచ్చే క్యాన్సర్లను కొన్నింటిని నివారించొచ్చు. సర్వైకల్ క్యాన్సర్ కనిపెట్టడానికి రెగ్యులర్​గా పాప్​స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ టెస్ట్​లో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయంటే... ప్రి – క్యాన్సర్ స్టేజ్​లోనే కనిపెట్టొచ్చు. అంతేకాదు.. డయాబెటిస్​, ఒబెసిటీ ఉన్నవాళ్లు ఈ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. అలా చేయించుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు. డయాబెటిస్​, ఒబెసిటీ ఉన్న వాళ్లలో పీసీఓఎస్ ఉంటే వాళ్లలో ఎండోమెట్రిక్ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ. 

ఈ మూడు క్యాన్సర్లతో పాటు యుటిరైన్ క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. ఒబెసిటీ, హైపర్ టెన్షన్, డయాబెటిస్​ మూడు ఉన్నవాళ్లకు యుటిరైన్ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో కూడా ఎండోమెట్రియల్​ క్యాన్సర్ ఛాన్స్​ పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో పరీక్షల్లో క్యాన్సర్లు త్వరగా గుర్తించగలుగుతున్నారు. కాబట్టి ఈ క్యాన్సర్​ కేసుల లెక్క బయటకు తెలుస్తోంది. అలాగే అందుకు తగ్గట్టు అడ్వాన్స్​డ్​ ట్రీట్​మెంట్ అందుతోంది. దాంతో జీవిత కాలం కూడా పెరుగుతోంది.