ఎలక్ట్రిక్​ బండ్లకు బ్యాటరీలు మన రాష్ట్రంలోనే

ఎలక్ట్రిక్​ బండ్లకు బ్యాటరీలు మన రాష్ట్రంలోనే

తెలంగాణలో యూనిట్ల ఏర్పాటుకు 3 కంపెనీలు రెడీ

హైదరాబాద్‌, వెలుగు : తెలంగాణలో తయారీ యూనిట్లు పెట్టేందుకు ముగ్గురు లీ అయాన్‌ బ్యాటరీ తయారీదారులు ఆసక్తి చూపిస్తున్నారు. తొలిదశలో రూ. 1500 కోట్ల దాకా పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ సుజయ్‌ కారంపూరి వెల్లడించారు. ఈ మూడు యూనిట్లకు కలిపి 10 గిగావాట్ల సామర్థ్యం ఉంటుందని తెలిపారు. ఐతే, యూనిట్లను పెట్టే కంపెనీల పేర్లను వెల్లడించడానికి ఆయన ఇష్టపడలేదు. ఒకటి, రెండు నెలల్లోనే యూనిట్ల ఏర్పాటు పనులు మొదలవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అప్పటి నుంచి 9–15 నెలల కాలంలో  ఆ యూనిట్లలో ఉత్పత్తి మొదలుపెడతాయన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి ఇండియాలో  ఊపు తేవాలనే లక్ష్యంతో నీతి ఆయోగ్‌ గట్టి కృషి చేస్తోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా లీ అయాన్‌ బ్యాటరీ తయారీదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. తొలిదశలో ఉత్పత్తి సామర్థ్యం 1 గిగావాట్‌ ఉంటుందని,  ఆ తర్వాత 5 గిగావాట్లకు చేరుతుందని,  దశలవారీగా మొత్తం రూ. 6 వేల కోట్ల పెట్టుబడితో 10 గిగావాట్లకు సామర్థ్య విస్తరణ జరుగుతుందని సుజయ్‌ తెలిపారు. ఒకటి, రెండు నెలలలోపే ఆ కంపెనీల పేర్లను కూడా వెల్లడిస్తామని చెప్పారు. ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ సమ్మిట్‌ 2019లో  సుజయ్‌ పాల్గొన్నారు. తెలంగాణలో గిగా స్కేల్‌ లీ అయాన్‌ బ్యాటరీ ప్లాంట్‌ నెలకొల్పే సామర్థ్యం తమకు ఉందని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నీతి ఆయోగ్‌కు తెలిపింది. ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ కోసం 200 ఎకరాల విస్తీర్ణంలో పార్కును నెలకొల్పుతున్నట్లు సుజయ్‌ కారంపూరి తెలిపారు. భవిష్యత్‌లో దీనిని 800 ఎకరాలకు విస్తరించాలనే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌, సంబంధిత వ్యవస్థ వేళ్లూనుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇందుకోసం ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ విధానాన్ని రూపొందించామని, ఇంకా అధికారికంగా ప్రకటించలేదని ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఇండస్ట్రీస్‌, ఐటీ జయేష్‌ రంజన్‌ ఈ సమ్మిట్‌లో వెల్లడించారు.

లిథియం మైనింగ్‌‌లో ఇండియా కంపెనీలకు బొలీవియా ఆహ్వానం

ఎలక్ట్రిక్‌‌ వెహికిల్స్‌‌, లాప్‌‌టాప్స్‌‌, స్మార్ట్‌‌ఫోన్ల బ్యాటరీల తయారీలో వాడే లిథియం తమ దగ్గర పుష్కలంగా ఉండటంతో ఇండియా కంపెనీలను బొలీవియా ఆహ్వానిస్తోంది. దక్షిణ అమెరికాలోని బొలీవియాలో నీతి ఆయోగ్‌‌ ప్రతినిధులతోపాటు, ఇండియాలోని కొన్ని ప్రభుత్వ రంగ కంపెనీల ప్రతినిధులు కూడా పర్యటించినట్లు ఇండియాలో ఆ దేశపు రాయబారి జే జే కోర్టెజ్‌‌ వెల్లడించారు. రెండు దేశాల మధ్య సహకారానికి మంచి అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. అల్యూమినియం, కాపర్‌‌ తయారీలోని మూడు ఇండియా కంపెనీలు పర్యటించాయని పేర్కొన్నారు. తమ దేశంలో ఉన్న అవకాశాలను ఆ కంపెనీలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఎలక్ట్రిక్‌‌ వెహికిల్‌‌ 2019 సమ్మిట్‌‌లో జే జే కోర్టెజ్‌‌ పాల్గొన్నారు. బొలీవియాలో ఇప్పటికే ఒక చైనా కంపెనీ, ఒక జర్మనీ కంపెనీ లిథియం ఉత్పత్తి చేస్తున్నాయని, ఎగుమతుల కోసం 15 వేల టన్నుల లిథియం ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. బ్యాటరీ తయారు చేయడానికి అవసరమైన హంగులన్నీ తమ వద్ద లేవని, ముఖ్యంగా టెక్నాలజీ క్లిష్టమైనదని కోర్టెజ్‌‌ పేర్కొన్నారు. టెక్నాలజీ రంగంలో ఇండియా చాలా ముందంజ వేసింది కాబట్టి, రెండు దేశాలూ కలిసి పనిచేయడానికి వీలుందని అన్నారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వ్యాపారం 850 మిలియన్‌‌ డాలర్ల మేర జరిగిందని, ఇండియా తమ నుంచి విరివిగా బంగారం కొంటున్నట్లు చెప్పారు. రెండు దేశాల వ్యాపారం రాబోయే ఏళ్లలో బిలియన్ డాలర్లకు చేరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాము ఆసక్తితో ఉన్నామని, సరైన బిజినెస్‌‌ మోడల్‌‌ కోసం చూస్తున్నామని కూడా కోర్టెజ్‌‌ వెల్లడించారు.