బొగ్గు గనిలో ఉప్పొంగిన నీరు.. అస్సాంలో ముగ్గురు కార్మికులు మృతి..

  • బొగ్గు గనిలో ఉప్పొంగిన నీరు
  • అస్సాంలో ముగ్గురు కార్మికులు మృతి.. మరో 17మంది గల్లంతు
  •  నీటి మట్టం100 అడుగులకు చేరటంతో రెస్క్యూ కు ఆటంకం

దిస్పూర్: అస్సాంలోని దిమా హసావో జిల్లాలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఉమ్రాంగ్సో ఏరియాలోని300 అడుగుల లోతు గల గనిలో బొగ్గు తవ్వుతుండగా ఒక్కసారిగా నీరు ఉప్పొంగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు చనిపోయారు. మరో 17 మంది కార్మికులు గనిలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌ చేపట్టారు. గనిలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగాయి.

బొగ్గు గనిలో కార్మికులు తవ్వుతుండగా నీరు ఉప్పొంగిందన్నారు. నీటి ప్రవాహం పెరగడంతో గని నుంచి వరద బయటకు వచ్చిందని చెప్పారు. ఇప్పటికే ముగ్గురు కార్మికులు చనిపోయారని.. మృతదేహాలను ఇంకా బయటకు తీసుకురాలేదని తెలిపారు.

గనిలో చిక్కుకుపోయిన వారిని సేఫ్​గా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ  టీములు పనిచేస్తున్నాయని వివరించారు. రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌ కోసం హెలికాప్టర్లు, ఇంజినీర్ల సహాయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఉదయం 8:45 గంటలకు మొదటి రెస్క్యూ బృందం గనిలోకి ప్రవేశించింది. బాధిత కుటుంబ సభ్యులు, వారి సహోద్యోగులు సైట్ వద్ద గుమిగూడారు. తమ వారి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు.

గనిలోని వరద నీటిపై హెల్మెట్లు, చెప్పులు తేలియాడుతుండటంపై ఆందోళన వ్యక్తం అవుతున్నది. కాగా..గనిలో చట్ట విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. ఈ కేసుకు సంబంధించి పునీశ్ నునిసా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.