మెదక్ జిల్లాలో సన్న ధాన్యం మిల్లింగ్ షురూ

  • జిల్లాలో 20 రైస్​మిల్లులకు కేటాయింపు
  • ఇప్పటి వరకు 290 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ 

మెదక్, వెలుగు : ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లు, అంగన్​ వాడీ కేంద్రాలతో పాటు జనవరి 1 నుంచి రేషన్​కార్డుదారులకు ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో సవిల్​ సప్లై డిపార్ట్​మెంట్ సన్నబియ్యం సేకరణపై దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి సారిగా ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 2024 వానకాలం సీజన్​లో రైతులు పండించిన సన్న ధాన్యాన్ని కనీస మద్దతు ధరకంటే రూ.500 అదనంగా బోనస్​ ఇచ్చి కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వానకాలం సీజన్​లో జిల్లాలో మొత్తం 2.97 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది.

తద్వారా కొనుగోలు కేంద్రాలకు 1.20 లక్షల మెట్రిక్​ టన్నుల సన్నరకం వడ్లు, 2.80 లక్షల మెట్రిక్​ టన్నుల దొడ్డురకం వడ్లు కలిపి మొత్తం 4 లక్షల మెట్రిక్​ టన్నులు వస్తాయని అంచనా వేశారు. ఈ మేరకు సన్నరకం, దొడ్డు రకం వడ్ల కొనుగోలుకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు,  మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి దారుల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ నెల రెండో తేదీ వరకు 5,527 రైతుల నుంచి 25 వేల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కొనుగోలు చేశారు. 

20 మిల్లుల్లో మిల్లింగ్​ప్రక్రియ

సివిల్​ సప్లై డిపార్ట్​మెంట్​అధికారులు కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న సన్న ధాన్యాన్ని వెంటనే రైస్​ మిల్లులకు తరలిస్తుండడంతోపాటు, మిల్లింగ్​ ప్రక్రియ కూడా మొదలు పెట్టారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టిన సన్న వడ్లను పెద్దశంకరంపేట, నర్సాపూర్, పాపన్నపేట, తూప్రాన్, రామాయంపేట తదితర ప్రాంతాల్లోని 20 రైస్ మిల్లులకు కేటాయించారు. ఆయా మిల్లుల్లో మిల్లింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 290 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సేకరించారు. 

నెలకు 600 మెట్రిక్​ టన్నులు

జిల్లాలోని  ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లలో​చదివే పిల్లల భోజనం కోసం ప్రతి నెల 600 మెట్రిక్​ టన్నుల సన్న బియ్యం అవసరమవుతాయి. ఈ మేరకు అవసరమైన సన్న బియ్యాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సివిల్​ సప్లై జిల్లా మేనేజర్​ హరికృష్ణ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో మిల్లింగ్​ చేసిన సన్న బియ్యాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలోని గవర్నమెంట్​ స్కూల్స్, హాస్టళ్లకు పంపిస్తున్నామని చెప్పారు.