సమాచారం ఇవ్వకుండానే.. ఎన్డీటీవీలో వాటాల కొనుగోలు 

సమాచారం ఇవ్వకుండానే.. ఎన్డీటీవీలో వాటాల కొనుగోలు 

అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ విశ్వ ప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమెటెడ్ (వీసీపీఎల్) ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను కొనుగోలు చేసిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్డీటీవీ స్పందించింది. ఎన్డీటీవీ వ్యవస్థాపక ప్రమోటర్లు రాధికా రాయ్, ప్రణయ్ రాయ్ లతో ఎలాంటి చర్చలు జరపకుండా వీసీపీఎల్ ఈ ప్రకటన చేసిందని వెల్లడించింది. తమ యాజమాన్యానికి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే.. ఎన్డీటీవీ గ్రూప్ ను నియంత్రించే రాధికా రాయ్ ప్రణయ్ రాయ్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఆర్పీఆర్ హెచ్) పై పట్టు సాధించామని వీసీపీఎల్ వెల్లడించిందని తెలిపింది. ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ సంస్థకు చెందిన అన్ని ఈక్విటీ షేర్లను బదలాయించేందుకు రెండు రోజుల గడువు ఇచ్చామని వీసీపీఎల్ ప్రకటించడాన్ని ఎన్డీటీవీ యాజమాన్యం తప్పుపట్టింది. 

2009 – 2010లో ఇరు కంపెనీల లోన్ అగ్రిమెంట్.. 

2009 – 2010 ఆర్థిక సంవత్సరంలో ఎన్డీటీవీ వ్యవస్థాపకులు రాధికా రాయ్, ప్రణయ్ రాయ్, వీసీపీఎల్ మధ్య ఒక రుణ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం తాము పొందిన హక్కులను అనుసరించి ఎన్డీటీవీలోని 29.18 శాతం వాటాను దక్కించుకున్నామని వీసీపీఎల్ వాదిస్తోంది. ఈ ఒప్పందం కుదిరిన మాట నిజమైనదే అయినప్పటికీ.. తమకు మాట మాత్రం చెప్పకుండా వాటాలు కొనుగోలు చేసినట్లు ఏకపక్షంగా వీసీపీఎల్ ప్రకటించుకోవడాన్ని  ఎన్డీటీవీ యాజమాన్యం తప్పుపడుతోంది. అకస్మాత్తుగా మంగళవారం రోజే తమకు ఈ విషయం తెలిసిందని చెబుతోంది. ఈనేపథ్యంలో కంపెనీ వ్యవస్థాపకుల షేర్ హోల్డింగ్స్ లో ఎటువంటి మార్పు జరగలేదనే విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేశామని ఎన్డీటీవీ ప్రకటించింది. నిక్కచ్చిగా నిలిచే జర్నలిజం కోసం ఇలాగే నిలబడతామని తేల్చిచెప్పింది.  ఎన్డీటీవీ కంపెనీకి 2022 ఫైనాన్షియల్​ ఇయర్లో రూ.421 కోట్ల రెవెన్యూ మీద రూ.85 కోట్ల  నికరలాభం వచ్చింది. 

రూ.493 కోట్లతో మరో 26 శాతం వాటా కొనుగోలు ?

ఎన్​డీటీవీలో 29.18 శాతం వాటాలు కొనడానికి అదానీ గ్రూప్ కు చెందిన​మీడియా సంస్థ ఓపెన్​ అగ్రిమెంట్​ కుదుర్చుకుందంటూ అంతకుముందు మీడియాలో వార్తలు వచ్చాయి. రూ.493 కోట్లతో మరో 26 శాతం వాటా కొనడానికి ఓపెన్​ ఆఫర్​ను కూడా ప్రకటించనుందని అందులో ప్రస్తావించారు.