హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైవేలపై ఎలక్ట్రానిక్ వెహికల్స్ పవర్ చార్జింగ్ స్టేషన్లు రాబోతున్నాయి. ప్రతి 25 కిలోమీటర్లకో స్టేషన్ ఏర్పాటు కాబోతోంది. ఇందుకోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఏర్పాట్లు చేస్తోంది. చార్జింగ్ స్టేషన్‌లో ఒక్కో చార్జింగ్ యూనిట్‌కు రూ. 50 లక్షల వరకు ఖర్చు చేయనుంది. ఈ స్టేషన్లకు విద్యుత్ సంస్థలు కూడా ప్రత్యేక టారిఫ్ రూపొందించాయి. లో టెన్షన్ కేటగిరీకి యూనిట్‌కు రూ.6గా నిర్ణయించాయి. హై టెన్షన్ విభాగంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు యూనిట్‌కు రూ.7గా ఫిక్స్ చేశాయి. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు యూనిట్‌కు రూ.5, మిగిలిన సమయాల్లో రూ.6గా నిర్ణయించాయి.
సిటీలో 136 స్టేషన్లు అవసరం
ఎలక్ట్రికల్ వాహనాలు చాన్నాళ్ల నుంచే అందుబాటులో ఉన్నా ఫుల్ చార్జింగ్‌కు 40 నుంచి వంద కిలోమీటర్లే వెళ్లేవి. దీంతో వాహనదారులు ఆసక్తి చూపించలేదు. కానీ నేడు 450 కిలోమీటర్లకు పైగా నడిచే కార్లు, వెహికల్స్ వచ్చాయి. వాడకం పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2 వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. దీంతో చార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు సంస్థలు ముందుకొస్తున్నాయి. హైదరాబాద్‌లో 136 స్టేషన్లు అవసరమని కేంద్రం అంచనా వేయగా ప్రస్తుతం 50 వరకు ఉన్నాయి. మెట్రో రైల్ కూడా సిటీలో చార్జింగ్ స్టేషన్లను తీసుకొచ్చింది. ఈ స్టేషన్లతో 58 నిమిషాల్లో వెహికల్ ఫుల్ చార్జ్ అవుతుంది. అదే ఇంట్లోనైతే 6 గంటలు పడుతుంది. ఎలక్ట్రిక్ కార్లతో కిలోమీటరుకు రూపాయి చొప్పున ఖర్చయితే డీజిల్‌కు రూ.5 అవుతుంది. ఎలక్ర్టికల్ వెహికల్స్ వాడకం పెంచేందుకు చార్జింగ్ పాయింట్లను డిస్కమ్‌లే ఏర్పాటు చేయాలని గతంలో కేంద్రం సూచించింది. కానీ అవి ఇప్పటికీ దృష్టి పెట్టలేదు.
