రుణమాఫీకి 26 వేల కోట్లు

రైతులకు రూ. 2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటికే రూ. లక్ష వరకు లోన్లను మాఫీ చేసింది. పంద్రాగస్టులోపు రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేసేందుకు సిద్ధమైంది. రైతు రుణమాఫీకి బడ్జెట్​లో రూ. 26 వేల కోట్లు కేటాయించింది. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో కలిపి రైతుల పంట రుణాలు రూ. 31 వేల కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గత బీఆర్​ఎస్​ సర్కారు తరహాలో విడతల వారీగా కాకుండా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేయాలని రాష్ట్ర సర్కారు సంకల్పించింది.

 తాజా కేటాయింపులతో సీఎం ప్రకటించినట్లుగా ఆగస్టు 15లోగా రాష్ట్ర రైతులు రుణ విముక్తులు కానున్నారు. ‘‘కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైంది. తీవ్ర నిరాశలో ఉన్న రాష్ట్ర అన్నదాతల్లో ఈ రుణమాఫీతో భవిష్యత్తుపై తిరిగి ఆశలు చిగురించాయి. వారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక ముందు కూడా రైతు పక్షాన మా ప్రభుత్వం సదా అండగా ఉంటుంది” అని బడ్జెట్​ స్పీచ్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.