లగచర్ల కేసులో 25 మందికి బెయిల్‌ 

  • పట్నం నరేందర్ రెడ్డి సహా 20 మంది నేడు రిలీజ్ అయ్యే చాన్స్
  • వారంలో ఒకరోజు పోలీసుల ముందు హాజరవ్వాలని షరతు 
  • బెయిల్ మంజూరైనా జైలులోనే మరో ఐదుగురు 
  • భోగమోని సురేశ్ బెయిల్ పై నేడు వాదనలు

హైదరాబాద్‌‌, వెలుగు : వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, ఇతర ఆఫీసర్లపై దాడి కేసులో నిందితులకు బెయిల్ లభించింది. భోగమోని సురేశ్ మినహా ప్రధాన నిందితుడు బీఆర్‌‌‌‌ఎస్‌‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌‌‌‌రెడ్డి, రైతు హీర్యానాయక్‌‌ సహా 25 మందికి నాంపల్లి స్పెషల్ కోర్టు బుధవారం బెయిల్‌‌ మంజూరు చేసింది. 59వ నిందితుడు ఉగ్గప్ప, 70వ నిందితుడు మంగ్యా నాయక్‌‌ పోలీస్ కస్టడీలో ఉండడంతో వారి బెయిల్‌‌ పిటిషన్‌‌ను కోర్టు డిస్మిస్‌‌ చేసింది. పట్నం నరేందర్‌‌ ‌‌రెడ్డి రూ.50 వేల పూచికత్తు, రెండు ష్యూరిటీలు, మిగతా నిందితులు ఒక్కొక్కరు రూ.20 వేల పూచికత్తు, రెండు చొప్పున ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది.

నరేందర్‌‌‌‌రెడ్డి ప్రతి శుక్రవారం, మిగతా నిందితులు బుధ, గురువారాల్లో ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బోంరాస్‌‌పేట్‌‌ ఎస్‌‌హెచ్‌‌ఓ ముందు హాజరు కావాలని షరతు విధించింది. వీరిలో పట్నం నరేందర్‌‌‌‌రెడ్డి చర్లపల్లి జైలు రిమాండ్‌‌లో ఉండగా మిగతా 24 మంది సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్నారు. బెయిల్‌‌ మంజూరైన 25 మందిలో కాంగ్రెస్‌‌ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్‌‌‌‌ను నిర్బంధించిన కేసులోని ఐదుగురు నిందితులు మినహా మిగతా వారు గురువారం విడుదల కానున్నారు. ఇక భోగమోని సురేశ్ బెయిల్‌‌ పిటిషన్‌‌పై గురువారం వాదనలు జరుగనున్నాయి.

కాగా, ఈ కేసులో 71 మంది నిందితులుగా ఉండగా, పట్నం నరేందర్‌‌‌‌రెడ్డి సహా 38 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుల్లో ఆరుగురికి హైకోర్టు ముందస్తు బెయిల్‌‌ మంజూరు చేసింది. ఒకరిని అరెస్ట్ చేయకుండా విచారించాలని ఆదేశించింది.