ప్రియాన్ష్ సాహ్ని టాప్ యూట్యూబర్స్లో ఒకరు. తన ఛానెల్ పేరు ప్రైమ్జ్(primz). ఆ ఛానెల్లో పేరడీ పాటలు, కామెడీ స్కిట్లు, షార్ట్స్ పోస్ట్ చేస్తుంటాడు. ప్రియాన్ష్ పోస్ట్ చేసే ఒక్కో వీడియోకి, షార్ట్‌కి మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. ఇప్పటికే ఈ ఛానెల్‌కు 3.86 మిలియన్ సబ్‌స్ర్కయిబర్లు ఉన్నారు. కంటెంట్ క్రియేట్ చేయడంలో కింగ్ అనిపించుకుంటున్న ఈ 22 ఏండ్ల ప్రియాన్ష్ జర్నీ ఇది.
ప్రియాన్ష్ సాహ్ని 2001లో ఇండియాలో పుట్టాడు. తొమ్మిదేండ్ల వయసులో ఫ్యామిలీ అమెరికాకు షిఫ్ట్ అయింది. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. ప్రియాన్ష్కి చిన్నప్పటి నుంచి మ్యాజిక్ చేయడం ఇష్టం. హైస్కూల్లో చదువుతున్నప్పుడు మెజీషియన్‌గా చాలా మ్యాజిక్ షోలు చేసేవాడు. ఆ ఇంట్రెస్ట్‌తోనే యూట్యూబ్ ఛానెల్ పెట్టాలనే ఆలోచన కలిగింది. అయితే, యూట్యూబ్‌లో కంటెంట్ కోసం ‘మ్యాజిక్’ కి బదులు ‘మ్యూజిక్’ ఎంచుకున్నాడు.
మార్చి 2020లో ‘బజ్’ అనే ఛానెల్‌ని మొదలుపెట్టాడు. అందులో ఒక ఒరిజినల్ పాటని పేరడీ చేసి, మ్యూజిక్ వీడియో ఒకటి చేసి, దాన్ని యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశాడు. ఆ తర్వాత ‘బెల్లా పోర్చ్, ది కిడ్ లారోయి, డాబేబీ’ వంటి పేరడీ పాటలు చాలా చేశాడు. అయితే ఫేమస్ ర్యాపర్ అయిన లిల్ నాస్ ఎక్స్ పాడిన ‘మోంటెరో’కు పేరడీ పాడాడు ప్రియాన్ష్. ఆ వీడియో వైరల్ కావడంతో బాగా గుర్తింపు వచ్చింది. ప్రియాన్ష్ పేరడీ పాటలు పాపులర్ మ్యూజిక్ యాప్ స్పాటిఫైలో కూడా వినొచ్చు.
ఇలా పేరడీ పాటలే కాకుండా ఇండియన్ కిడ్‌గా తను ఎలా పెరిగాడు? అని కామెడీ స్కిట్స్ చేస్తుంటాడు. అందులో వెరైటీగా గెటప్‌లు వేసుకుంటాడు. స్కిట్లో క్యారెక్టర్స్ అన్నీ అతనే యాక్ట్ చేస్తాడు. పంచ్‌లు, సెటైర్లతో నవ్విస్తాడు. అలాగే కొన్ని వీడియోల్లో కాన్సెప్ట్నే పేరడీ సాంగ్‌గా కంపోజ్ చేసి, దానికి తగ్గట్టు యాక్టింగ్ చేస్తాడు. అంటే మాటల్నే పాట రూపంలో చెప్తూ నవ్విస్తాడు. ఇండియాలో ప్రియాన్ష్ టాప్ యూట్యూబర్ అయినప్పటికీ అతనికి ఫ్యాన్స్, ఫాలోవర్స్ మాత్రం ప్రపంచమంతటా ఉన్నారు. కొన్నిసార్లు ప్రియాన్ష్ వీడియోల కింద కామెంట్స్ చూస్తే ఇతర దేశాల వాళ్లవే ఎక్కువగా ఉంటాయి. వాళ్లు కూడా అతని టాలెంట్‌ని మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతుంటారు. ఉదాహరణకు ఈ మధ్య జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ గురించి పెట్టిన వీడియోకి ఆస్ట్రేలియా వ్యూయర్స్ స్పందించారు. అందులో అన్నీ పాజిటివ్ కామెంట్లే. ప్రియాన్ష్ చేసే కంటెంట్ కూడా అలానే ఉంటుంది.
కామెడీ కోసం ఇతరుల్ని కించపరచడం, అవమానిస్తూ మాట్లాడటం చేస్తుంటారు కొందరు. కానీ, ప్రియాన్ష్ చేసే కామెడీలో అలాంటి వాటికి తావుండదు. హెల్దీ కామెడీ మాత్రమే ఉంటుంది. ఎవరినీ నొప్పించకుండా నవ్విస్తాడు. అదే తన సక్సెస్‌కి కారణం అని కూడా చెప్పొచ్చు. ప్రియాన్ష్ యూట్యూబ్ వీడియోలతోపాటు టీవీ కమర్షియల్, స్పాన్సర్స్ నుంచి కూడా సంపాదిస్తున్నాడు. అలాగే కొన్ని పాపులర్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఉన్నాడు. ఏడాదికి దాదాపు ఒక మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నట్టు రిపోర్ట్ ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్ వీడియోలతో కోట్లు సంపాదిస్తున్నాడు. ఇదేకాకుండా ప్రియాన్ష్కి మరో రెండు ఛానెల్స్ కూడా ఉన్నాయి.
ఒకటి ఓయ్ ప్రైమ్జ్, దీనికి 173వేల మంది ఫాలోవర్స్ ఉంటే, ఇంకోటి ప్రైమ్జ్ అన్ఫిల్టర్డ్ అనే ఛానెల్‌కి 23.4వేల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. అవి కూడా ఎంటర్టైన్మెంట్ ఛానెల్సే. యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటాడు ప్రియాన్ష్. అందులో తన లైఫ్ స్టయిల్ వీడియోలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాడు. టిక్‌టాక్ యాప్ ఉన్నప్పుడు ‘ఐయామ్ ప్రిన్జ్’ పేరుతో అందులో వీడియోలు పోస్ట్ చేసేవాడు ప్రియాన్ష్.
ఎక్కువ వ్యూస్ వీటికే
మొదటి పేరడీ పాట ‘ఐ ట్రయిడ్ మేకింగ్ ఎ క్వారెంటైన్ ర్యాప్ సాంగ్’ని మార్చి 7, 2020లో పోస్ట్ చేశాడు. తన ఫస్ట్ షార్ట్ వీడియో ‘మోంటెరో’ని ఏప్రిల్, 2021లో పోస్ట్ చేశాడు. ప్రియాన్ష్ వీడియోల్లో ఎక్కువ మంది చూసిన వీడియో ‘కిడ్స్ వర్సెస్ డాడ్ వర్సెస్ మామ్ : వెన్ సోప్ డిస్పెన్సర్ ఈజ్ ఎంప్టీ’. దీన్ని జులై 11, 2022లో పోస్ట్ చేశాడు. అలాగే ఏప్రిల్ 2, 2023లో పోస్ట్ చేసిన ‘ఇండియన్ బోన్స్–ఇమాజిన్ డ్రాగన్స్’ అనే పేరడీ వీడియో ఎక్కువమంది చూసిన పెద్ద వీడియోల్లో ఒకటి.