ఆస్పత్రిలో 22 మంది మృతికి మాక్ డ్రిల్ కారణమా!

ఆస్పత్రిలో 22 మంది మృతికి మాక్ డ్రిల్ కారణమా!

ఆగ్రా, న్యూఢిల్లీ: కరోనా ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న పేషెంట్లకు ఆక్సిజన్​ సప్లై కట్​ చేసిందో ఆస్పత్రి.. మాక్ డ్రిల్​ పేరుతో ఆక్సిజన్​ ఆపేయడంతో 22 మంది పేషెంట్లు చనిపోయారు. ఉత్తరప్రదేశ్​లోని ఆగ్రా సిటీలో ఈ దారుణం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటపడింది. దీంతో యోగి సర్కారు విచారణకు ఆదేశించింది. ఆగ్రా సిటీలోని పరాస్​ ఆస్పత్రి యాజమాన్యం ఏప్రిల్​ 26న ఆక్సిజన్​ మాక్​ డ్రిల్​ నిర్వహించింది. చికిత్స తీసుకుంటున్న కరోనా పేషెంట్లకు 5 నిమిషాల పాటు ఆక్సిజన్​ సప్లై నిలిపేసింది. దీంతో కరోనా వార్డులో ఉన్న పేషెంట్లలో 22 మందికి ఆక్సిజన్​ అందలేదు. వారి శరీరాలు నీలం రంగులోకి మారాయి. కాసేపయ్యాక ఆక్సిజన్​ సప్లై ప్రారంభించినా ఆ పేషెంట్ల పరిస్థితి మెరుగుపడక, అంతా చనిపోయారు. అదే వార్డులో ఉన్న 74 మంది పేషెంట్లు మాత్రం బాగానే ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో తాజాగా సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. చికిత్స తీసుకుంటున్న పేషెంట్లలో ఆక్సిజన్​అవసరం ఎవరికి ఉందని తెలుసుకోవడానికి, వారికి మాత్రమే ఆక్సిజన్​ అందించి ప్రాణాలు కాపాడేందుకే ఈ మాక్​డ్రిల్​ చేసినట్లు యాజమాన్యం చెప్పింది. ఏప్రిల్​లో రాష్ట్రంలో ఆక్సిజన్​ కొరత ఉందని పేర్కొంది. ఈ మాక్​ డ్రిల్​లో 22 మంది పేషెంట్లు చనిపోయారనే వార్తలను మేనేజ్​మెంట్​ కొట్టిపారేసింది. ఆక్సిజన్​ అందక తమ ఆస్పత్రిలో ఏ ఒక్క పేషెంటు కూడా చనిపోలేదని వివరించింది. ఈ ఘటనపై ఆగ్రా కలెక్టర్​ స్పందిస్తూ.. ఏప్రిల్​లో ఆక్సిజన్​ కొరత లేదన్నారు. పేషెంట్ల మరణాలకు సంబంధించిన వీడియో తమ నోటీసుకు కూడా వచ్చిందని, ఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఆస్పత్రి ఓనర్​పై పాండమిక్​ యాక్ట్ కింద కేసు ఫైల్​ చేసి, పరాస్​ ఆస్పత్రిని సీజ్​ చేసినట్లు కలెక్టర్​ ప్రభు ఎన్​ సింగ్​ చెప్పారు.