జమిలి ఎన్నికలపై జేపీసీ.. కమిటీలో 21 మంది లోక్ సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు

జమిలి ఎన్నికల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)ని ఏర్పాటు చేసింది. బీజేపీ లోక్ సభ ఎంపీ పిపి చౌదరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రదాన్, కాంగ్రెస్ నుంచి ప్రియాక గాంధీ వాద్ర, మనీష్ తివారీ, సుప్రియా సూలే (ఎన్సీపీ) తదితరులు ఉన్నారు. 

అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి  బాలశౌరి (జనసేన), జియం హరీష్ బాలయోగి (టీడీపీ),  సీఎం రమేష్ (బీజేపీ) ఉన్నారు. మొత్తం 31 మంది సభ్యులతో కూడిన జేపీసీలో 21 మంది లోక్ సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం  ఏర్పాటు చేసింది. 

జమిలి బిల్లులపై అధ్యయనం కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. వచ్చే శుక్రవారంతో పార్లమెంట్ వింటర్ సెషన్ ముగియనుండటంతో ఆలోపే జేపీసీని నియమించాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. లేదంటే ఈ రెండు బిల్లులూ ల్యాప్స్ అవుతాయి. అలా అయితే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మళ్లీ వీటిని తిరిగి సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. 

అందుకే జమిలి ఎన్నికలపై జేపీసీనీ త్వరితగతిన ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో లోక్ సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది చొప్పున గరిష్టంగా 31 మంది సభ్యులు ఉన్నారు. పార్టీలకున్న ఎంపీల సంఖ్యను బట్టి చూస్తే.. బీజేపీ నుంచే ఎక్కువ మంది సభ్యులకు అవకాశం దక్కింది. అలాగే బీజేపీ సభ్యుడే కమిటీకి చైర్మన్ కానున్నారు. నివేదిక ఇచ్చేందుకు జేపీసీకి 90 రోజుల గడువు ఇవ్వనున్నారు.