నోరు, కాళ్లు కట్టేసి అతి క్రూరంగా 21 కుక్కలను చంపేసిన్రు

  • 40 అడుగుల ఎత్తైన వంతెన నుంచి పారేసిన గుర్తు తెలియని వ్యక్తులు
  • సంగారెడ్డి జిల్లాలో అమానుషం

సంగారెడ్డి, వెలుగు : నోరు, కాళ్లు కట్టేసి అతి క్రూరంగా 21 కుక్కలను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దు మైలారం సమీపంలో ఈ నెల 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జంతు హింసకు సంబంధించి 21 కుక్కలను కాళ్లు, నోరు కట్టి ఎత్తైన వంతెన నుంచి విసిరేసి చంపేసిన ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కుక్కలను చంపిన విషయమై ఇంద్రకరణ్  పోలీసులు గోప్యంగా ఉంచినప్పటికీ..

ఈ ఇష్యూ కాస్త మంగళవారం సోషల్  మీడియాలో వైరల్  అయ్యింది. దీంతో పోలీసులు స్పందించక తప్పలేదు. ఇందుకు సంబంధించి ఇంద్రకరణ్  ఎస్సై విజయ్ కుమార్  తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 3న సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు 32 కుక్కలను ఇంద్రకరణ్  సమీపంలోని బెంగుళూరు బైపాస్  రోడ్డుపై ఉన్న బ్రిడ్జి పైనుంచి పడేశారు. వాటిలో 21 కుక్కలు చనిపోగా, మరో 11 కుక్కలు గాయపడ్డాయి.

4న ఉదయం గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఇంద్రకరణ్  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన కుక్కలను సిటిజెన్  ఫోరం ఫర్  ఎనిమల్స్  సభ్యులకు అందజేశారు. వాటిని తరలిస్తుండగా, మరో 2 కుక్కలు చనిపోయాయి. మిగిలిన 9 కుక్కలు సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు. అయితే చనిపోయిన కుక్కలకు మండల పశు వైద్యాధికారి జబీన్  ఆధ్వర్యంలో 4న పోస్ట్ మార్టం నిర్వహించి ఖననం చేశారు.

కుక్కలను ఎవరు పడేశారన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగింది? ఎవరు చేశారు? అనే దానిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో కేసును త్వరగా తేల్చాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.