దేశాన్ని బతికించిన వ్యక్తి పీవీ : పొన్నం ప్రభాకర్‌‌‌‌

  • హనుమకొండ జిల్లా వంగరలో పీవీ 20వ వర్ధంతి

భీమదేవరపల్లి, వెలుగు : ఆర్థిక సంస్కరణలతో దేశం ప్రపంచంతో పోటీపడేలా చేసి, దేశాన్ని బతికించిన మహావ్యక్తి పీవీ.నరసింహారావు అని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ కొనియాడారు. దేశానికి పెద్ద పెద్ద కార్లు, సాంకేతిక విప్లవం వచ్చాయంటే ఆయనే కారణం అని చెప్పారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో సోమవారం నిర్వహించిన పీవీ వర్ధంతికి పొన్నం హాజరై, ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ యువత పీవీ స్ఫూర్తితో సన్మార్గంలో నడవాలని సూచించారు.

హుస్నాబాద్‌‌‌‌ నియోజకవర్గంలోని వంగర పేరును ప్రపంచ వ్యాప్తం చేశారన్నారు. వంగర గ్రామ బ్రిడ్జికి నిధులు కేటాయించి త్వరలోనే పూర్తి చేస్తామని, పీవీ స్మారక వనం పనులు సైతం త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. పీవీ సొంత గ్రామంలో టెక్నాలజీ, ఎడ్యుకేషన్, రూరల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌, సాంస్కృతిక శిక్షణ జరిగేలా చేస్తే బాగుంటుందన్నారు. హనుమకొండ జిల్లాకు నవోదయ స్కూల్‌‌‌‌ను కేటాయిస్తే దానిని వంగర గ్రామంలోనే ఏర్పాటు చేయాలని ప్రధానికి లెటర్‌‌‌‌ రాశామని మంత్రి చెప్పారు. ఈ విషయమై కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.

పీవీ కుటుంబ సహకారంతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. అత్యంత మారుమూల ప్రాంతం నుంచి దేశానికి ప్రధాని కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. అనంతరం పీవీ.నర్సింహారావు కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర క్యాలెంటర్‌‌‌‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు వాణిదేవి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌‌‌‌.నాగరాజు, వరంగల్‌‌‌‌ సీపీ అంబర్‌‌‌‌ కిశోర్‌‌‌‌ ఝూ, ఆర్డీవో రాథోడ్‌‌‌‌ రమేశ్‌‌‌‌, పీవీ కుమారులు ప్రభాకర్‌‌‌‌రావు, మదన్‌‌‌‌మోహన్‌‌‌‌, కాంగ్రెస్ నాయకులు వోడితెల ప్రణవ్, మార్కెట్ కమిటీ చైర్మన్‌‌‌‌ కేడం లింగమూర్తి, కిసాన్‌‌‌‌ సెల్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ పాల్గొన్నారు.