2024 టాలీవుడ్ రివ్యూ.. హిట్టు..ఫట్టు..వివాహాలు..వివాదాలు

వరల్డ్‌‌వైడ్‌‌గా తెలుగు సినిమాలకు మంచి గుర్తింపు రావడంతో ప్రస్తుతం అందరిచూపు టాలీవుడ్‌‌పైనే  ఉంది. యూనివర్సల్ కంటెంట్‌‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు మన  ఫిల్మ్ మేకర్స్.  దీంతో  ఇతర ఇండస్ట్రీస్‌‌తో పోల్చుకుంటే  తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది. ఈ ఏడాది టాలీవుడ్‌‌లో సుమారు 250 చిత్రాలు విడుదలవగా  వాటిలో ఎన్ని సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.. ఎన్ని సినిమాలను తిరస్కరించారు, ఎలాంటి చిత్రాలను ఆదరించారు, అలాగే తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు,  వివాహ బంధంతో ఒక్కటైన నటీనటులు, ఇండస్ట్రీలో  జరిగిన వివాదాల గురించి ఇయర్ ఎండింగ్ రివ్యూలో  తెలుసుకుందాం.

హిస్టరీ క్రియేట్ చేస్తూ..

ఈ ఏడాది  టాలీవుడ్‌‌ కనకవర్షాన్ని కురిపించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రాలు  ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులతో హిస్టరీ క్రియేట్ చేశాయి.  సంక్రాంతి హిట్లతో మొదలైన ఈ ప్రయాణం క్రిస్మస్ వరకు  కొనసాగింది. ఈ ఏడాది ప్రారంభంలో  చిన్న సినిమాగా బరిలోకి దిగిన ‘హనుమాన్’ పెద్ద విజయాన్ని అందుకుని  తెలుగు పరిశ్రమకు మంచి బూస్టప్‌‌ ఇచ్చింది. వరల్డ్‌‌వైడ్‌‌గా రూ.300 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ అబ్బురపరిచింది. అలాగే సంక్రాంతి రేసులో వచ్చిన  మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రానికి మిక్స్‌‌డ్ టాక్ వచ్చినా.. రూ.172 కోట్లు కలెక్షన్స్ సాధించింది.  నాగార్జున ‘నా సామిరంగ’ కూడా పొంగల్ సక్సెస్‌‌లో భాగమైంది.  ఇక మార్చిలో విడుదలైన చిత్రాల్లో యంగ్ హీరో  సిద్ధు జొన్నలగడ్డ నటించిన  ‘టిల్లు స్క్వేర్‌‌’ రూ.135 కోట్ల కలెక్షన్స్‌‌తో  భారీ విజయాన్ని అందుకుంది. ఇక సెకండాఫ్‌‌లో ప్రభాస్ పవర్‌‌‌‌ను చూపించాడు. నాగ్‌‌ అశ్విన్‌‌ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడి’ చిత్రం రూ. వెయ్యి కోట్ల వసూళ్ల క్లబ్‌‌లో చేరింది. ఎన్టీఆర్‌‌ హీరోగా శివ కొరటాల రూపొందించిన  ‘దేవర 1’ కూడా మంచి వసూళ్లతో విజయాన్ని సాధించింది. అలాగే  నాని  ‘సరిపోదా శనివారం’, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’చిత్రాలు వంద కోట్లు రాబట్టి మంచి సక్సెస్‌‌లను సొంతం  చేసుకున్నాయి. ఇక ఈ ఏడాది చివరిలో ‘పుష్ప2 ది రూల్’ అంటూ వచ్చి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ సత్తా చాటాడు అల్లు అర్జున్. విడుదలైన రోజు నుంచి కలెక్షన్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్లకుపైగా వసూళ్లు  రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా ‘పుష్ప2’ నిలిచింది.

తెలంగాణ నేపథ్యంలో..  

తెలంగాణ నేపథ్యంలో రూపొందిన సినిమాల సంఖ్య ఈ ఏడాది మరింత పెరిగింది. అయితే వాటిలో మెప్పించినవి మాత్రం తక్కువే. హైదరాబాదీ యాసతో ఇప్పటికే ‘డీజీ టిల్లు’గా మెప్పించిన సిద్ధు జొన్నలగడ్డ, దీనికి సీక్వెల్‌‌గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్‌‌‌‌’తో మరో భారీ విజయాన్ని అందుకుని 100 కోట్ల క్లబ్‌‌లో చేరాడు. ఇక రజాకార్ల అరాచకాలపై తీసిన హిస్టారికల్ యాక్షన్ మూవీ ‘రజాకార్’ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. పొలిటికల్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా వచ్చిన  ‘జితేందర్ రెడ్డి’ పర్వాలేదనిపించింది.  తెలంగాణ పెళ్లి, సంప్రదాయాల నేపథ్యంలో తీసిన ‘లగ్గం’ ఫ్యామిలీ ఆడియెన్స్‌‌కు చేరువైంది.  సర్కారు నౌకరి, ఉరుకు పటేలా, లైన్ మ్యాన్, పైలం పిలగా, షరతులు వర్తిస్తాయి, బహిర్భూమి, గొర్రెపురాణం, కేశవచంద్ర రమావత్ చిత్రాలు ఆశించిన స్థాయి విజయాన్ని  అందుకోలేకపోయాయి. 

బిగ్గెస్ట్ డిజాస్టర్స్ 

స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోల సినిమాలు కూడా ఈ ఏడాది  అభిమానులను  నిరాశపరిచాయి.  ఎన్నో అంచనాల మధ్య రిలీజై బిగ్గెస్ట్ డిజాస్టర్లు‌‌గా మిగిలిపోయాయి. ముందుగా వెంకటేష్ 75వ సినిమాగా వచ్చిన ‘సైంధవ్‌‌’ డిజప్పాయింట్ చేసింది.‘ఫ్యామిలీ స్టార్’గా వచ్చిన విజయ్ దేవరకొండకు పరాజయం ఎదురైంది. రామ్, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్‌‌’ డిజాస్టర్‌‌‌‌గా నిలిచింది.  అలాగే రవితేజ నుంచి ఈగల్, మిస్టర్ బచ్చన్ అనే  రెండు చిత్రాలు రాగా, రెండూ ఫ్లాప్ టాక్‌‌ తెచ్చుకున్నాయి. వరుణ్ తేజ్ కూడా ఆపరేషన్ వాలంటైన్, మట్కా చిత్రాలతో  పరాజయాల పాలయ్యాడు. అలాగే ఆ ఒక్కటీ అడక్కు, బచ్చలమల్లి చిత్రాలు అల్లరి నరేష్‌‌ను, హరోం హర, మా నాన్న సూపర్ హీరో చిత్రాలు సుధీర్ బాబును నిరాశపరిచాయి.  శర్వానంద్ ‘మనమే’, కార్తికేయ ‘భజే వాయువేగం’ రాజ్ త‌‌రుణ్ నుంచి వచ్చిన  తిర‌‌గ‌‌బ‌‌డ‌‌రా సామీ, పురుషోత్తముడు, భలే ఉన్నాడే చిత్రాలు పరాభవం పొందాయి. వీటితో పాటు మరి కొన్ని చిన్న సినిమాలు థియేట‌‌ర్లలో సంద‌‌డి చేయ‌‌లేక‌‌పోయాయి.

వివాదాలమయం

సినీ  పరిశ్రమకు వివాదాలు, కేసులు కొత్తేమీ కాదు. అయితే అంతకుమించి అన్నట్లు ఈ ఏడాది టాలీవుడ్‌‌ను వివాదాలు చుట్టుముట్టాయి.  అల్లు అర్జున్ అరెస్ట్‌‌,  మోహన్ బాబు కుటుంబ గొడవలు, సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున వేసిన పరువు నష్టం దావా,  లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌‌‌‌ అరెస్ట్, రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం, బెంగుళూరు డ్రగ్స్ కేసు.. లాంటివన్నీ  ఈ ఏడాది టాలీవుడ్‌‌ని హెడ్ లైన్స్‌‌లో నిలిపాయి.

కొత్త జీవితానికి శ్రీకారం

ఈ ఏడాది చాలా మంది సెలెబ్రిటీలు  తమ బ్యాచ్‌‌లర్ లైఫ్‌‌కు గుడ్ బై చెప్పి..  వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ముందుగా ఫిబ్రవరిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో  జరిగింది. జులైలో వరలక్ష్మి శరత్‌‌కుమార్‌‌‌‌.. తన ప్రియుడు  నికోలయ్ సచ్​దేవ్​ను వివాహమాడింది. ఆగస్టులో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ గోరఖ్‌‌ పెళ్లి చేసుకున్నారు. అలాగే  సెప్టెంబర్‌‌‌‌లో  హీరో సిద్ధార్థ్​..  హీరోయిన్ అదితి రావు హైదరి మెడలో మూడుముళ్లు వేశాడు. ఇక డిసెంబర్​లో హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల ఒక్కటయ్యారు. ఫైనల్‌‌గా ఈనెల 12న హీరోయిన్ కీర్తి సురేష్.. చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్​ను  గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. అలాగే  హీరోయిన్ మేఘా ఆకాశ్‌‌తో పాటు నటుడు సుబ్బరాజు, దర్శకులు క్రిష్,  సందీప్ రాజ్, హీరో శ్రీసింహాలు కూడా ఈ ఏడాది తమ​ బ్యాచిలర్ లైఫ్​కు గుడ్ బై చెప్పేశారు.

వైవిధ్యం ప్రధానంగా..

కొత్తదనం, వైవిధ్యం ఉన్న సినిమాలపై తెలుగు ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీల రాక తర్వాత ప్రేక్షకుల అభిరుచి మరింతగా మారింది.  కంటెంట్ బాగుంటే చిన్నా, పెద్ద.. హీరో, డైరెక్టర్ అనే తేడా చూపించకుండా ఎలాంటి చిత్రాన్నైనా ఆదరిస్తున్నారు. ఈ ఏడాది కూడా డిఫరెంట్‌‌ కాన్సెప్ట్‌‌ను ఎంచుకుని కన్విన్సింగ్‌‌గా స్టోరీ చెప్పిన సినిమాలకు పట్టం కట్టారు.  వీటిలో కొన్ని బాక్సాఫీస్ విజయాలను అందుకోగా, మరికొన్ని  జనం మన్ననలు అందుకున్నాయి. ఊహకందని క్లైమాక్స్‌‌తో కిరణ్ అబ్బవరం హీరోగా ‘క’ తీసిన సుజీత్, సందీప్.. తొలిచిత్రంతోనే ప్రేక్షకులను అబ్బురపరిచి సూపర్ హిట్ అందుకున్నారు. అలాగే గ్రామీణ నేపథ్యంలో సహజత్వానికి దగ్గరగా తీసిన ఆయ్, కమిటీ కుర్రోళ్లు చక్కని విజయాన్ని సాధించాయి.  విశ్వక్‌‌సేన్ అఘోరాగా నటించిన ‘గామి’,  ఇన్సూరెన్స్‌‌ క్రైమ్స్‌‌పై తీసిన ‘మెకానిక్ రాకీ’ చిత్రాలు కాన్సెప్ట్‌‌ పరంగా మెప్పించాయి. ఫేస్ బ్లైండ్‌‌నెస్‌‌ కాన్సెప్ట్‌‌తో వచ్చిన సుహాస్ ‘ప్రసన్న వదనం’,  మోహన్ భగత్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ఆరంభం’, శ్రీవిష్ణు ‘శ్వాగ్’ మంచి ప్రయత్నాలుగా నిలిచాయి. అజయ్ ఘోష్ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, నివేదా థామస్ ‘35 చిన్న కథ కాదు’,  సుహాస్ ‘జనక అయితే గనక’ చిత్రాలు ప్రేక్షకుల మనసును హత్తుకున్నాయి.  క్రైమ్ కామెడీ జానర్‌‌‌‌లో ఆనంద్ దేవరకొండ ‘గంగం గణేశా’ శ్రీ సింహా ‘మత్తు వదలరా 2’,  సూపర్​ నేచురల్ థ్రిల్లర్‌‌గా వచ్చిన సందీప్ కిషన్ ‘ఊరుపేరు భైరవ కోన’  చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి.