2022లో 5 కోట్ల చదరపు అడుగుల జాగా అమ్మకం
నాలుగో క్వార్టర్లో మాత్రం తగ్గిన డిమాండ్
న్యూఢిల్లీ : దేశంలో మెట్రో నగరాల్లో ఆఫీసు స్పేస్ రంగం కిందటి ఏడాది దూసుకుపోయింది. టాప్–6 నగరాల్లో మొత్తం 50.6 మిలియన్ చదరపు అడుగుల జాగా అమ్ముడుపోయింది. నాలుగో క్వార్టర్లో మాత్రమే డిమాండ్ కొద్దిగా తగ్గింది. సీక్వెన్షియల్‌గా అమ్మకాలు 21 శాతం పడిపోయాయి. ప్రస్తుతం ప్రపంచం అంతటా రెసిషన్ ఛాయలు కనిపిస్తున్నందున కొత్త సంవత్సరంలో ఆఫీసు స్పేస్ అమ్మకం తక్కువగా ఉండొచ్చని కాలియర్స్ స్టడీ రిపోర్ట్ అంచనా వేసింది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్, హైదరాబాద్, ముంబై, పుణేల్లో ఆఫీసు స్పేస్‌కు డిమాండ్ బాగా ఉందని తెలిపింది. వీటిలో ఖాళీలు వార్షికంగా 190 బేసిస్ పాయింట్లు తగ్గి 16.6 శాతానికి పడిపోయాయి. అంటే కమర్షియల్ ఆఫీసు మార్కెట్ బలంగా పుంజుకున్నట్టు భావించాలి. అంతేకాదు అమ్మకాలు కరోనా ముందునాటి స్థాయికి చేరుకున్నాయి. 50.6 మిలియన్ చదరపు అడుగుల జాగా అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి.
కరోనా కారణంగా రెండేళ్లపాటు ఆచితూచి వ్యవహరించిన కంపెనీలు దీని ఎఫెక్ట్ తగ్గాక విపరీతంగా జాగాను కొన్నాయి. 2022లో ఆఫీసులన్నీ కళకళలాడాయని కాలియర్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రమేశ్ నాయర్ చెప్పారు. ఈసారి బీఎఫ్ఎస్ఐ కంపెనీలు ముఖ్యంగా బ్యాంకులు విపరీతంగా ఆఫీసు స్పేస్‌ను కొన్నాయని, కిందటి ఏడాదితో పోలిస్తే వీటి వాటా రెట్టింపు అయిందని చెప్పారు. మొత్తం లీజింగ్‌లో బీఎఫ్ఎస్ఐ వాటా దాదాపు 14 శాతం ఉందని నాయర్ వివరించారు. ముంబైలో ఇట్లాంటి కంపెనీలు ఏకంగా 40 శాతం జాగా కొన్నాయని పేర్కొన్నారు. ఢిల్లీ–--ఎన్‌సీఆర్ మార్కెట్ కిందటి ఏడాదితో పోలిస్తే 72 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2020, 2021లో పెరిగిన డిమాండ్ 2022లోనూ కొనసాగింది. 2023లో హైబ్రిడ్ ఆఫీస్ కల్చర్‌కు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తాయని, ఫ్లెక్స్ ఆపరేటర్లు భారీ మార్కెట్ వాటాను సాధిస్తారని కాలియర్స్ తెలిపింది. ఢిల్లీ–-ఎన్‌సిఆర్‌తో పాటు టైర్ 2 పట్టణాల్లో కూడా ఫ్లెక్స్ ఆపరేటర్‌ల నుంచి చాలా ప్రాజెక్టులు వస్తాయని కాలియర్స్‌లో నార్త్ మేనేజింగ్ డైరెక్టర్ భూపీంద్ర సింగ్ తెలిపారు.2022 సంవత్సరంలో మొత్తం 42.9 మిలియన్ చదరపు అడుగుల సరఫరా ఉందని అన్నారు. ఇది మునుపటి సంవత్సరం కంటే 23 శాతం ఎక్కువని అన్నారు.
