హైదరాబాద్​ తాగునీటికి గోదావరి నుంచి 20 టీఎంసీలు

  • 2050 అవసరాలకు తగ్గట్టు భవిష్యత్తు ప్రణాళిక రూపొందించాలి
  • జలమండలి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం​
  • నగరంలో ఇంటింటికీ తాగునీటితోపాటు సీవరేజీ ప్లాన్ ఉండాలి
  • కాలం చెల్లిన వాటర్​ పైపులైన్ల వెంబడి కొత్త లైన్​ నిర్మాణం చేపట్టాలి
  • గోదావరి ఫేజ్-2కు మల్లన్నసాగర్​ నుంచి నీటిని లిఫ్ట్​ చేయాలని సూచన

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​ హైదరాబాద్ లో రాబోయే 25 ఏండ్ల  అవసరాలకు తగ్గట్టుగా డ్రింకింగ్​వాటర్​, సీవరేజ్​ ప్లాన్​ ఉండాలని అధికారులను సీఎం రేవంత్​ ఆదేశించారు. ఇందుకు అవసరమైన ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​ చేయాలని సూచించారు. ఇందుకోసం అవసరమైతే ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్​లో శుక్రవారం జరిగిన హైదరాబాద్ జల మండలి బోర్డు సమావేశానికి బోర్డు చైర్మన్ హోదాలో సీఎం  రేవంత్ రెడ్డి తొలిసారి హాజరయ్యారు.  గ్రేటర్ హైదరాబాద్  విస్తరణను దృష్టిలో పెట్టుకొని 2050 నాటికి పెరిగే జనాభా అవసరాలకు సరిపడేలా ఫ్యూచర్ వాటర్, సీవరేజ్​ప్లాన్ ఉండాలని ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు.  ప్రస్తుతం నగరానికి మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి  నీటి సరఫరా జరుగుతున్నదని, గోదావరి ఫేజ్ –2 ద్వారా  గతంలో ప్రతిపాదించిన 15 టీఎంసీలకు బదులు పెరుగుతున్న నగర అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలను జంట జలాశయాలకు తరలించాలని నిర్ణయించి, ఆమోదం తెలిపారు.  గోదావరి ఫేజ్ –2 ప్రాజెక్టుకు మల్లన్నసాగర్ నుంచి నీటిని తీసుకోవాలా? కొండపోచమ్మ సాగర్ నుంచి తీసుకోవాలా? అనే అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. మల్లన్న సాగర్ లో నీటి లభ్యత ఎక్కువగా ఉండటం, లిఫ్టింగ్ వ్యయం తక్కువగా ఉండడం,  కన్సల్టెన్సీ ఏజెన్సీలు ఇచ్చిన రిపోర్టు కూడా మల్లన్నసాగర్​వైపే మొగ్గుచూపడంతో.. కొండ పోచమ్మ సాగర్​కు బదులు మల్లన్నసాగర్​నుంచే నీటిని లిఫ్ట్​ చేయాలని  నిర్ణయం తీసుకున్నారు. 

సొంత ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టాలి

హైదరాబాద్ జలమండలి ఆదాయ, వ్యయాల నివేదికను ఎండీ అశోక్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్​కు వివరించారు.  జలమండలికి వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలకు, తాగునీటి సరఫరా నిర్వహణ ఖర్చులకు సరిపోతుందని తెలిపారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, కార్యాలయాల నుంచి దాదాపు రూ. 4,300  కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, అదే సమయంలో కరెంటు బిల్లులకు జలమండలి దాదాపు రూ.5,500 కోట్లు చెల్లించాలని తెలిపారు. గతంలో తీసుకున్న అప్పులు రూ.1,847 కోట్లున్నాయని, దీంతో దాదాపు రూ. 8,800 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నదని వివరించారు. ఆదాయ, వ్యయాలు ఆశాజనకంగా లేనందున  వీటిని అధిగమించేందుకు ఆర్థిక శాఖ సమన్వయంతో తక్షణ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు. జలమండలి తమ సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని, అందుకు అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఇప్పటికే 20 వేల లీటర్ల నీటిని నగరంలో ఉచితంగా సరఫరా చేస్తున్నందున, ఇతర కనెక్షన్ల నుంచి రావాల్సిన నల్లా బిల్లు బకాయిలు క్రమం తప్పకుండా వసూలయ్యేలా చూడాలన్నారు. జలమండలి  కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవాలని,  తక్కువ వడ్డీతో రుణాలు తెచ్చుకునే ఏర్పాట్లు చేసుకోవాలని  సీఎం సూచించారు. అందుకు వీలుగా ప్రాజెక్టు డీపీఆర్లు తయారు చేయించాలని చెప్పారు.  సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్​ శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్,  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండీ అశోక్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి  పాల్గొన్నారు.

మంజీరా లైన్​వెంట ప్రత్యామ్నాయ పైప్​లైన్​

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 9,800 కిలో మీటర్ల  డ్రింకింగ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్​వర్క్ ద్వారా 13.79 లక్షల కనెక్షన్లకు వాటర్​ సప్లై చేస్తున్నట్టు సీఎం రేవంత్​కు అధికారులు నివేదించారు. మంజీరా ద్వారా1965 నుంచి నగరంలో పలు ప్రాంతాలకు  సరఫరా చేస్తున్న పైపులైన్లకు కాలం చెల్లిందని, దీంతో తరుచూ రిపేర్లు వస్తున్నాయని, ఫలితంగా ఒక్కోసారి  10 నుంచి 15 రోజులు నీటి సరఫరా నిలిచిపోతున్నదని అధికారులు  వివరించారు. ఈ పాత లైన్​ వెంబడి ప్రత్యామ్నాయంగా మరో అధునాతన లైన్ నిర్మించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్​ జీవన్ మిషన్ ద్వారా నిధులు తెచ్చుకునేందుకు వీలుగా ప్రాజెక్టు రిపోర్ట్​ తయారు చేయాలని సూచించారు.