అమృత్ తో మెదక్ దశ తిరిగేనా?

  • కేంద్రం నుంచి ఎక్కువ నిధుల మంజూరుకు అవకాశం
  • సమస్యల పరిష్కారం, అభివృద్ధికి చాన్స్​

మెదక్, వెలుగు: అటల్​ మిషన్​ ఫర్​ రీజు వనేషన్​ అండ్ ​అర్బన్ ​ట్రాన్స్​ఫర్మేషన్​(అమృత్) రెండో విడత స్కీంలో రాష్ట్రంలో 20 మున్సిపాలిటీలు సెలెక్ట్​ అయ్యాయి. ఇందులో మెదక్ మున్సిపాలిటీ ఒకటి. అమృత్​2 స్కీం కింద కేంద్ర ప్రభుత్వం మున్సిపల్​పట్టణాల అభివృద్ధి కోసం రూ.2,780 కోట్లు కేటాయించింది. ఎంపిక చేసిన మున్సిపల్​పట్టణాల్లో ఇంటింటికీ నల్ల కనెక్షన్లు, రోడ్ల అభివృద్ధి, ఎల్ఈడీ లైట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, పార్క్ ల అభివృద్ధి, కాలుష్య నియంత్రణ వంటి పనుల కోసం ఈ నిధులు వినియోగించుకునే అవకాశం ఉంది. 

ఈ మేరకు సంబంధిత మున్సిపాలిటీల్లో ఆయా పనులు చేపట్టేందుకు వీలుగా జియోగ్రాఫికల్​ఇన్ఫర్మేషన్​సిస్టం డ్రోన్​సర్వే బాధ్యతలను సర్వే ఆఫ్​ఇండియాకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. సర్వే నివేదికల ఆధారంగా మున్సిపల్​పట్టణాల అభివృద్ధికి మాస్టర్​ప్లాన్​రూపొందించనున్నారు. తదనుగుణంగా ఆయా అభివృద్ధి పనులు చేపడతారు. 

ఇదీ స్వరూపం..

మెదక్​మున్సిపల్​పరిధిలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. పట్టణ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 70 వేల జనాభా ఉండగా ప్రస్తుతం పట్టణ పరిధిలో సుమారు 90 వేల జనాభా ఉంటుంది. పలు కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. మెదక్​జిల్లా కేంద్రంగా ఏర్పాటయ్యాక పట్టణంలో జనాభా ఎక్కువగా పెరిగింది. తదనుగుణంగా అవసరాలు, సమస్యలు పెరిగాయి. ఆయా కాలనీల్లో మౌలిక వసతుల కొరత ఉంది.

 గత ప్రభుత్వ హయాంలో మిషన్​భగీరథ స్కీం కింద రూ.50 కోట్ల వ్యయంతో ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీటిని సరఫరా చేసే పనులు చేపట్టారు. ఆ పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం వల్ల ఇంకా పలు కాలనీలకు తాగునీరు సరఫరా కావడం లేదు. ఇదిలా ఉండగా పైప్​ లైన్​ వేసేందుకుగాను వీధుల్లో సీసీ రోడ్లను తవ్వేశారు. దీంతో దాదాపు పట్టణ వ్యాప్తంగా అనేక వార్డుల్లో అంతర్గత రోడ్లు దెబ్బతిని అధ్వాన్నంగా మారాయి. కొత్తగా ఏర్పాటైన పలు కాలనీల్లో రోడ్లు లేక రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టణంలో డ్రైనేజీ వవస్థ అస్థవ్యస్తంగా మారింది.

 మురుగు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేక భారీ వర్షాలు కురిసినపుడు అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. దాదాపు లక్ష జనాభా ఉన్న పట్టణంలో ప్రజలు సాయంత్రం వేళలో సేద తీరేందుకు ఒక్క పార్క్​ లేదు. గతంలో ఒక చిల్డ్ర్స్​న్స్​పార్క్​ ఉండగా దానిని మిషన్​ భగీరథ ఆఫీస్​కు కేటాయించడంతో ఉన్నొక్క పార్క్​ ప్రజలకు ఉపయోగపడకుండా పోయింది. ఈ నేపథ్యంలో మెదక్ మున్సిపాలిటీ అమృత్​-2 స్కీం కింద సెలెక్ట్​ కావడంతో కేంద్రం నుంచి నిధులు మంజురై మౌలిక వసతులు మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడనుంది. 

ప్రతిపాదనలు పంపాం

కేంద్ర ప్రభుత్వం మెదక్​మున్సిపాలిటీని అమృత్​-2 స్కీం కింద సెలెక్ట్​ చేయడం హర్షణీయం. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆరు వాటర్​ ట్యాంక్​ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాం. అండర్ గ్రౌండ్ డ్రేనేజీ నిర్మాణం కోసం మెదక్ ఎంపీకి ప్రతిపాదనలు ఇవ్వగా నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. అదనపు ట్యాంక్​ల నిర్మాణం చేపడితే అన్నిప్రాంతాలకు సరిపడా తాగునీటిని సరఫరా చేయొచ్చు. అలాగే అండర్​గ్రౌండ్​డ్రైనేజీ నిర్మాణం చేపడితే భారీ వర్షాలు పడినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. - చంద్రపాల్, మున్సిపల్ చైర్మన్