ఒకే నెంబర్​ నుంచి 20 కోట్ల స్పామ్​ కాల్స్

ఒకే నెంబర్​ నుంచి 20 కోట్ల స్పామ్​ కాల్స్

న్యూఢిల్లీ: మన దేశంలోని 20 కోట్ల మందికి ఒకే నెంబర్​ నుంచి స్పామ్​ కాల్స్​ వచ్చాయిట. ఈ ఏడాది జనవరి–అక్టోబర్​ మధ్యలోనే ఆ నెంబర్​ నుంచి ఆ కాల్సన్నీ వచ్చాయని ట్రూకాలర్​ తన గ్లోబల్​ స్పామ్​ రిపోర్టులో వెల్లడించింది. అంటే, రోజుకి 6,64,000 మందిని, గంటకు 27 వేల మందిని ఆ స్పామ్​ కాల్స్​ డిస్టర్బ్​ చేశాయన్న మాట. టాప్​ స్పామర్స్​ను గుర్తించి ఆటోమేటిక్​గా బ్లాక్​ చేస్తుంటుంది ట్రూకాలర్​. కానీ, ఏదోరకంగా ఈ టాప్​ స్పామర్​ ట్రూకాలర్​ గురి నుంచి తప్పించుకుంటున్నట్లు పేర్కొంది. అంతేకాదు, దేశంలోని టెలికం ఆపరేటర్లు ఇన్ని కాల్స్​ను చేయడానికి ఎలా ఒప్పుకున్నారోననే ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మన దేశంలో ఎక్కువ స్పామ్​ కాల్స్​ సేల్స్​, టెలిమార్కెటింగ్​కి సంబంధించినవేనని ట్రూకాలర్​ రిపోర్టు చెబుతోంది.కేవైసీ సాకుతో జనాలను కొల్లగొట్టే మోసగాళ్లు ఎక్కువయ్యారని, ఏదో ఒక విధంగా ఓటీపీలను చెప్పించుకుని వారు మోసాలకు పాల్పడతున్నారని తెలిపింది. ప్రతి మొబైల్​ యూజర్​ సగటున నెలకు 17 స్పామ్​ కాల్స్​ రిసీవ్​ చేసుకుంటున్నాడని, ట్రూకాలర్​ యూజర్లు ఒక్క అక్టోబర్​ నెలలోనే 380 కోట్ల కాల్స్​ రిసీవ్​ చేసుకున్నారని వెల్లడించింది. స్పామ్​ కాల్స్​ విషయంలో అన్ని దేశాల కంటే బ్రెజిల్​ ప్రపంచంలోనే ముందుందని ట్రూకాలర్​ ఈ రిపోర్టులో పేర్కొంది.