- క్రిప్టో ఇన్వెస్టర్లకు టోకరా ఇచ్చిన స్కిడ్ టోకెన్ డెవలపర్లు
- పాపులర్ షో స్కిడ్ గేమ్ పేరుతో మెమ్ క్రిప్టో..
- ఈ క్రిప్టోను అమ్మేద్దామంటే వీలుకాకుండా అడ్డు
- క్రిప్టో ఇండస్ట్రీలో అతిపెద్ద మోసం..రూ. కోట్ల రూపాయలు స్వాహా
బిజినెస్ డెస్క్, వెలుగు: గుడ్డిగా క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసేవారికి పెద్ద గుణపాఠం ఇది. కేవలం ఐదే ఐదు నిమిషాల్లో ఒక క్రిప్టో కరెన్సీ వాల్యూ 2,858.65 డాలర్ల (రూ. 2.14 లక్షల) నుంచి జీరోకి పడిపోవడాన్ని గమనించొచ్చు. నెట్‌ఫ్లిక్స్ పాపులర్ షో స్కిడ్ గేమ్ గురించి వినే ఉంటారు. ఈ షోని స్పూర్తిగా తీసుకొని క్రిప్టో కరెన్సీ స్కిడ్‌ను కొంత మంది డెవలపర్లు కిందటి వారమే లాంచ్ చేశారు. మొదట కేవలం ఒక డాలర్ కంటే తక్కువ దగ్గరే ఉన్న ఈ క్రిప్టో వాల్యూ, ఈ నెల ఒకటి (సోమవారం) న క్రిప్టో ఎక్స్చేంజి పాన్‌కేక్ స్వాప్‌లో 38 డాలర్ల వద్ద ట్రేడవుతుండేది. అక్కడితో ఆగితే సరిపోయేది. కానీ, ఇన్వెస్టర్ల దురాశతో ఈ కాయిన్ విలువ కేవలం కొన్ని గంటల్లోనే ఏకంగా 2,856.65 డాలర్లకు పెరగడం చూడొచ్చు. పాపులర్ షోలు, మీమ్‌లతో వస్తున్న క్రిప్టో కరెన్సీలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలిస్తుండడంతో, ఇన్వెస్టర్లు ఈ స్కిడ్ కాయిన్ వైపు కూడా పరుగులు తీశారు. ఇదే వారి కొంప ముంచింది. సోమవారం 2,856.65 డాలర్లను తాకిన ఐదు నిమిషాల్లోనే ఈ క్రిప్టో వాల్యూ 0.0007 డాలర్లకు పడిపోయింది.
ఇంకా 40 వేల మంది దగ్గర స్కిడ్ కాయిన్..
బ్లాక్‌చెయిన్ సెర్చ్ ఇంజిన్ బీఎస్‌సీ స్కాన్ ప్రకారం, ఇప్పటికీ ఈ క్రిప్టో కరెన్సీని 40 వేల మంది ఇన్వెస్టర్లు హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ క్రిప్టోను అమ్మినా ఎవరూ కొనరని, కొన్నా 0.0007 డాలర్లకే అమ్మాల్సి ఉంటుందని ఇన్వెస్టర్లు వాపోతున్నారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఇన్వెస్టర్ జాన్‌లీ(30) మొత్తం వెయ్యి డాలర్లు పెట్టి స్కిడ్ కాయిన్‌ను కొన్నారు. నెట్‌ఫ్లిక్స్ ఈ క్రిప్టోను తీసుకొచ్చిందని అనుకున్నానని చెప్పారు. నెట్‌ఫ్లిక్స్ ఈ సంఘటనపై స్పందించలేదు. స్కిడ్ కాయిన్ ఎందుకు అంతలా క్రాష్ అయ్యిందో కారణాలు ఇంకా తెలియలేదు. ఈ కాయిన్ క్రియేట్ చేసిన వారు ఎవరో కూడా తెలియదు. ఈ క్రిప్టో కరెన్సీ వెబ్‌సైట్ పనిచేయడం లేదు. డెవలపర్లకు సెండ్ చేసిన ఈ–మెయిల్ బౌన్స్ బ్యాక్ అయ్యిందనే వార్తలు వచ్చాయి. ఈ క్రిప్టోకు చెందిన ఆఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లు పనిచేయడం లేదు. ట్రేడింగ్ ఎక్స్చేంజి అయిన పాన్‌కేక్‌స్వాప్ ఈ సంఘటనపై స్పందించలేదు. స్కిడ్ కాయిన్‌ను క్రియేట్ చేసిన వారే ఇన్వెస్టర్ల డబ్బులతో ఉడాయించారని కాయిన్‌మార్కెట్‌క్యాప్ హెడ్ (కంటెంట్) మోలీ జేన్ జుకర్‌మన్ అన్నారు. ‘డెవలపర్లు ఆన్‌లైన్‌లోకి వచ్చి ‘ఇన్వెస్టర్లు భయపడాల్సిన పనిలేదు. టెక్నికల్ ప్రాబ్లమ్ వలనే ఈ సమస్య తలెత్తింది’ అని అంటారని నేను అనుకోవడం లేదు’ అని ఆమె తెలిపారు. స్కిడ్ కాయిన్ క్రాష్ అవ్వడంతో క్రిప్టో ఇండస్ట్రీలో రెగ్యులేటరీ అవసరాన్ని మరింత తెలుపుతోందని నిపుణులు చెబుతున్నారు. వోలటాలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రైవేట్ కంపెనీలు, ఇన్వెస్టర్లు క్రిప్టోల వైపు పరుగులు తీస్తున్నారు. అందుకే క్రిప్టో ట్రేడింగ్ ప్రస్తుతం పాపులర్‌గా మారిందని నిపుణులు పేర్కొన్నారు. స్కిడ్ వంటి మీమ్ కాయిన్లను డెవలప్ చేసే వారిని కనిపెట్టడం చాలా కష్టమని కాయిన్‌మార్కెట్‌క్యాప్ ఎడిటర్ యౌస్రా ఆన్వర్ అన్నారు.
అమ్ముదామంటే కుదర్లే..
స్కిడ్‌కు ట్రేడింగ్‌లో కొన్ని అసాధారణ ఫీచర్లు కనిపించాయని ఆన్వర్ పేర్కొన్నారు. స్కిడ్ డెవలపర్లు బయ్యర్లకు అనుమతి ఎక్కువగా ఇచ్చారు. అంటే ఇద్దరు కొనడానికి వస్తే కేవలం ఒకరు మాత్రమే అమ్మడానికి వీలు కలిపించారు. స్కిడ్ డెవలపర్లు ఈ విధానాన్ని ‘యాంటీ డంప్’ మెకానిజంగా పిలిచారు. ఇలాంటి చర్యలు అమ్మకాలను అపడానికి కాదని, ఇన్వెస్టర్ల డబ్బులను దోచుకోవడానికేనని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు స్కిడ్ టోకెన్‌ను అమ్మాలంటే ఇన్వెస్టర్ల దగ్గర మార్బల్స్ అనే మరో టోకెన్ ఉండాలనే రూల్‌ను కూడా డెవలపర్లు పెట్టారు. అంటే స్కిడ్ గేమ్స్ షోలో ఉండేటట్టు గేమ్‌లను ఆన్‌లైన్‌లో ఆడాల్సి ఉంటుంది. అప్పుడు మార్బల్స్ టోకెన్ దక్కుతుంది.
ఈ టోకెన్స్ ఉంటేనే స్కిడ్ టోకెన్స్ అమ్మడానికి వీలవుతుంది. ఈ ఆన్‌లైన్ గేమ్‌లను ఆడాలంటే ఎంట్రీ ఫీజు కింద 456 స్కిడ్ టోకెన్లను చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఫీచర్లు ఉండడం వలనే స్కిడ్ టోకెన్‌ను ఇన్వెస్టర్లు ఈజీగా అమ్మలేకపోయారని జుకర్‌మన్ అన్నారు. ఈ క్రిప్టో కరెన్సీ క్రాష్ వలన ఎంత నష్టపోయారో అంచనా వేయలేమని చెప్పారు. బీఎస్‌ఈస్కాన్ రెండు క్రిప్టో అడ్రస్‌లను డౌట్‌ఫుల్ అడ్రస్‌లుగా గుర్తించింది. ఇందులో ఒక అడ్రస్ ద్వారా 3.38 మిలియన్ డాలర్లు విలువైన స్కిడ్ టోకెన్లను బీఎన్‌బీ క్రిప్టోల కింద కన్వర్ట్ చేశారు. ఈ ట్రాన్సాక్షన్‌ను పూర్తి చేయడానికి కాయిన్ మిక్సర్ అయిన టొరండోను వాడారు. దీంతో ఈ ట్రాన్సాక్షన్లను పట్టుకోవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.
