మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్ పారాండ్ ఫారెస్ట్ ఏరియాలో అంతర్జాతీయ చీతా దినోత్సవం సందర్భంగా అగ్ని, వాయు అనే రెండు మగ చీతాలను నేషనల్ పార్కులోకి విడిచిపెట్టారు. ఇంతకాలం ఎన్‌క్లోజర్‌లో ఉన్న చీతాలను భద్రతకు సంబంధించిన అన్నిరకాల చర్యలు తీసుకున్న తర్వాత అడవిలో స్వేచ్ఛగా విహరించేందుకు విడిచిపెట్టామని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తమ్‌కుమార్ శర్మ వెల్లడించారు.
ప్రాజెక్టు చీతా
భారతదేశంలో చీతాలు తగిన ఆవాస ప్రాంతాలు లేకపోవడం, వేట తదితర కారణాలతో అంతరించిపోయాయి. ఈ క్రమంలో మళ్లీ చీతాల జనాభాను పెంచాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చీతా ప్రాజెక్టును చేపట్టింది. ఈ క్రమంలో 2022, సెప్టెంబర్ 17న నమీబియా నుంచి తెప్పించిన ఎనిమిది చీతాలను ప్రధాన నరేంద్ర మోదీ కూనో నేషనల్ పార్క్ ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. వాటిలో ఐదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి. అనంతరం 2023, ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తెప్పించి పార్క్‌లో వదిలారు. ప్రస్తుతం కూనో పార్క్‌లో 24 చీతాలు ఉన్నాయి.
కూనో నేషనల్ పార్క్
కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో ఉన్నది. కూనో నది (చంబల్ నది ప్రధాన ఉప నదుల్లో ఒకటి) పేరునే ఈ పార్క్‌కు పేరు పెట్టారు. ప్రారంభంలో వన్యప్రాణుల అభయారణ్యంగా స్థాపించారు. 2018లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ పార్క్‌గా మార్చింది.