రారాజు..యువరాజు..ఇరగదీశారు..సెంచరీలతో మెరిసిన కోహ్లీ, జైస్వాల్‌‌

  • తొలి టెస్టులో  విజయం ముంగిట ఇండియా 
  • 534 రన్స్‌‌ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో12/3తో ఆసీస్‌‌ ఎదురీత

పెర్త్‌‌‌‌ : ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియావిజయం దాదాపు ఖాయమైంది. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో బోణీ చేసేందుకు బుమ్రాసేన 7 వికెట్ల దరంలో నిలిచింది.  తన పనైపోయిందన్న విమర్శలకు చెక్‌‌ పెడుతూ ‘క్రికెట్ రారాజు’ విరాట్ కోహ్లీ (143 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో100 నాటౌట్‌‌)  టెస్టుల్లో 30వ సెంచరీ కొడితే.. అతని బాటలో నడుస్తున్న  యువరాజు యశస్వి జైస్వాల్ (297 బాల్స్‌‌లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 161) భారీ ఇన్నింగ్స్‌‌తో దుమ్మురేపడంతో పెర్త్‌‌లో వరుసగా మూడో మూడు రోజూ ఇండియా హవానే నడిచింది. 

దాంతో రెండో ఇన్నింగ్స్‌‌ను 487/6 స్కోరు వద్ద డిక్లేర్‌‌‌‌ చేసిన ఇండియా ఆతిథ్య జట్టుకు 534 రన్స్ భారీ టార్గెట్ ఇచ్చింది. ఛేజింగ్‌‌లో ఆదివారం, మూడో రోజు చివరకు ఆస్ట్రేలియా 4.2 ఓవర్లలోనే 12/3తో ఓటమికి ఎదురీదుతోంది. కెప్టెన్ బుమ్రా (2/1) దెబ్బకు ఓపెనర్‌‌‌‌ మెక్‌‌స్వీని (0), లబుషేన్ (3) పెవిలియన్‌‌ చేరగా.. కమిన్స్‌‌ (2)ను సిరాజ్‌‌ వెనక్కుపంపించాడు. ఖవాజా (3 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు.  మరో రెండు రోజుల ఆట మిగిలున్న మ్యాచ్‌‌లో ఇండియా విజయానికి ఏడు వికెట్లు అవసరం కాగా.. ఆసీస్‌‌కు ఇంకా 522 రన్స్‌‌ కావాలి. అద్భుతం జరిగితే తప్ప ఈ పోరులో కంగారూ టీమ్‌‌ ఓటమి తప్పించుకోలేదు. 

ముందు ప్రిన్స్‌‌..తర్వాత కింగ్‌

పేస్ వికెట్‌‌పై మూడో రోజు కూడా ఇండియా బ్యాట్‌‌తో మెప్పించింది. ఓవర్‌‌‌‌నైట్ స్కోరు 172/0తో ఆట కొనసాగించిన జట్టును ఓపెనర్లు కేఎల్‌‌ రాహుల్‌‌ (77), జైస్వాల్‌‌ ముందుకు తీసుకెళ్లారు. ఆట మొదలైన వెంటనే హేజిల్‌‌వుడ్‌‌ వేసిన బౌన్సర్‌‌‌‌ను  ర్యాంప్‌‌షాట్‌‌తో సిక్స్‌‌ కొట్టిన22 ఏండ్ల  జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విదేశాల్లో అతనికిదే తొలి సెంచరీ కావడం విశేషం. మరోవైపు రాహుల్‌‌ కూడా దూకుడు చూపెట్టాడు. స్టార్క్‌‌ వేసిన ఓవర్‌‌‌‌పిచ్‌‌ బాల్స్‌‌కు షాట్లు కొట్టి రన్స్‌‌ రాబట్టాడు. స్కోరు 200 దాటిన తర్వాత స్టార్క్‌‌ వేసిన యాంగిల్‌‌ బాల్‌‌కు కీపర్‌‌‌‌ క్యారీకి క్యాచ్‌‌ ఇవ్వడంతో 201 రన్స్‌ రికార్డు పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ ముగిసింది. 

వన్‌‌డౌన్‌‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ (25) కాసేపు ఆకట్టుకున్నాడు. అయితే,  రెండో సెషన్‌‌లో ఆసీస్ బౌలర్లు వరుస వికెట్లతో పుంజుకున్నారు.275/1తో లంచ్ బ్రేక్‌‌కు వెళ్లొచ్చిన తర్వాత  పడిక్కల్‌‌ను హేజిల్‌‌వుడ్‌‌ పెవిలియన్ చేర్చాడు. ఇక 150 మార్కు దాటిన జైస్వాల్‌‌ .. మిచెల్ మార్ష్‌‌  వేసిన వైడ్‌‌ బాల్‌‌ను పాయింట్‌‌లో స్మిత్‌‌ చేతుల్లోకి కొట్టి తన అద్భుత ఇన్నింగ్స్‌‌ను ముగించాడు. లైయన్ బౌలింగ్‌‌లో రిషబ్ పంత్ (1) స్టంపౌటవ్వగా.. జురెల్ (1)ను కమిన్స్‌‌ ఎల్బీ చేయడంతో ఇండియా 321/5తో నిలిచింది. ఇక్కడి నుంచి కోహ్లీ హవా మొదలైంది. 

సుందర్ (29) తోడుగా విరాట్ అద్భుతమైన షాట్లతో అలరించాడు. పిచ్‌‌పై లభిస్తున్న అనూహ్యమైన బౌన్స్‌‌తో బౌలర్లు ఇబ్బంది పెడుతున్నా  కోహ్లీ తన మాస్టర్‌‌‌‌ క్లాస్ ఆటతో వారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. స్టార్క్‌‌ బౌలింగ్‌‌లో అప్పర్ కట్ షాట్‌‌తో సిక్స్‌‌, కమిన్స్ బౌలింగ్‌‌లో తన ట్రేడ్‌‌ మార్క్‌‌ ఆఫ్‌‌ డ్రైవ్‌‌తో ఆకట్టుకున్నాడు.  స్పిన్నర్‌‌‌‌ లైయన్‌‌ను స్వీప్‌‌ షాట్లతో నిలువరించాడు. స్కోరు 400 దాటిన తర్వాత స్పిన్నర్ లైయన్ బౌలింగ్‌‌లో సుందర్ ఔటవగా..  

కోహ్లీకి తోడైన తెలుగు కుర్రాడు నితీశ్‌‌ రెడ్డి (38 నాటౌట్‌‌) భారీ షాట్లతో దూకుడుగా ఆడాడు. లైయన్‌‌ టర్నింగ్‌‌ బాల్‌‌ను సిక్స్‌‌ కొట్టి ఔరా అనిపించాడు. లబుషేన్‌‌ బౌలింగ్‌‌లో ఫోర్‌‌‌‌తో  కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే బుమ్రా ఇన్నింగ్స్‌‌ను డిక్లేర్‌‌‌‌ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌‌కు వచ్చిన ఆసీస్‌‌ ఐదు ఓవర్లు కూడా ఆడకముందే మూడు వికెట్లు కోల్పోయి పూర్తి ఆత్మరక్షణలో పడింది.

35  జైస్వాల్ ఈ ఏడాది టెస్టుల్లో కొట్టిన సిక్సర్లు. ఒక క్యాలెండర్ ఇయర్‌‌‌‌లో ప్లేయర్‌‌‌‌కు అత్యధికం. 2014లో 33 సిక్సర్లు కొట్టిన బ్రెండన్‌‌ మెకల్లమ్‌‌ రికార్డును బ్రేక్ చేశాడు. 

201 తొలి వికెట్‌‌కు జైస్వాల్‌‌, రాహుల్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌ ఆసీస్‌‌లో టెస్టుల్లో ఇండియాకు అత్యధికం. 1986లో సిడ్నీ టెస్టులో గావస్కర్‌‌‌‌-శ్రీకాంత్ నెలకొల్పిన 191 రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ రికార్డు బ్రేక్ అయింది.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌ : 150 ఆలౌట్; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌ : 104 ఆలౌట్‌‌; ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌ :  134.3  ఓవర్లలో 487/6 డిక్లేర్డ్‌‌  (జైస్వాల్ 161, కోహ్లీ 100*, లైయన్ 2/96); ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ (టార్గెట్‌‌:534) : 4.2 ఓవర్లలో 12/3 (ఖవాజా 3 బ్యాటింగ్‌‌, బుమ్రా 2/1)