- 2016-20 మధ్య ఇతర పార్టీల్లోకి..
- మొత్తంగా పార్టీలు మారిన 405 మంది ఎమ్మెల్యేలు
- అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫామ్స్ సర్వే రిపోర్టు
న్యూఢిల్లీ: 2016–20 మధ్య కాలంలో కాంగ్రెస్ నుంచి సుమారు 170 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలలోకి జంప్ అయ్యారని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫామ్స్ సర్వే వెల్లడించింది. అయితే బీజేపీ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇతర పార్టీల్లో చేరారని తెలిపింది. ఈ మార్పులు కూడా ఎన్నికల సమయంలోనే జరిగాయని సర్వే రిపోర్టులో పేర్కొంది. కాగా, మొత్తంగా 405 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారని, వారిలో 182 మంది బీజేపీలోనే చేరారని చెప్పింది. ఇక 38 మంది కాంగ్రెస్లో, 25 మంది టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో అయిదుగురు బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్కు చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ నుంచి బయటికి వచ్చారని చెప్పింది. 2016–20 మధ్య పార్టీ మారిన వారిలో 16 మంది రాజ్యసభకు పోటీ చేయగా.. 10 మంది బీజేపీలో చేరారు. 12 మంది లోక్సభ ఎంపీలు పార్టీలు మారగా.. వారిలో అయిదుగురు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, కర్నాటకలో అసెంబ్లీ ఎలక్షన్లు రావడానికి ఎమ్మెల్యేలు పార్టీ మారడమే కారణమని చెప్పింది.
