- బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ పూర్తికావడంతో నెరవేరనున్న నల్గొండ ప్రజల కల
- లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యం
- పదేండ్లలో బీఆర్ఎస్ పాలనలో 10 శాతం పనులు పూర్తి కాలే
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పనులు స్పీడప్
- రేపు సీఎం చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభం
నల్గొండ, వెలుగు: ఎట్టకేలకు 17 ఏండ్ల తర్వాత బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం చేయడంతో ఈ ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగాయి. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ పై దృష్టి సారించి ఫండ్స్ విడుదల చేసింది. దీంతో పనులు పూర్తికావడంతో ఈనెల7న ప్రాజెక్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
లక్ష ఎకరాలకు సాగు నీరు..
నల్గొండ జిల్లాలోని నకిరేకల్, నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల పరిధిలోని లక్ష ఎకరాల సాగునీరు అందించేందుకు 2007లో బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.699 కోట్లు ఆమోదం లభించింది. సాంకేతిక అనుమతులతో రూ.535 కోట్లకు పర్మిషన్ వచ్చింది. మరో రూ.50 కోట్లు భూసేకరణ కోసం రైతులకు చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ.400 కోట్లు ఖర్చు పెట్టారు. నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కెట్ పల్లి, చిట్యాల, శాలిగౌరారం, కట్టంగూరు మండలాల్లో 65 వేల ఎకరాలు, నల్గొండ నియోజకవర్గంలో 24 వేల ఎకరాలు, మునుగోడులో 10,200 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు.
పదేండ్లలో 10 శాతం పనులను పూర్తి కాలే..
2007లో ప్రాజెక్టు పనులను ప్రారంభించగా, 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 80 శాతం పనులు పూర్తిచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్ట్ కోసం ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. నాడు నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫండ్స్ రిలీజ్ కోసం బీఆర్ఎస్ సర్కారుపై ఒత్తిడి చేసినా ఫలితం లేకుండా పోయింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పనులు స్పీడప్..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ పై దృష్టి సారించింది. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా నిధులు విడుదల చేసింది. 2007లో రూ.400 కోట్ల అంచనా వ్యయంతో పనులను ప్రారంభించగా, పనులు ఆలస్యం కావడంతో 17 ఏండ్లలో ఈ ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెరిగింది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మొత్తం ఖర్చు రూ.వెయ్యి కోట్లకు చేరింది. ఏడాదిలోనే మిగిలిన పనులన్నీ ప్రభుత్వం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది.
ప్రాజెక్ట్ పూర్తి కావడంతో నా జన్మ ధన్యమై౦ది..
బ్రహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ పూర్తి కావడంతో నా జన్మ ధన్యమైంది. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ 17 ఏండ్లకు పూర్తయింది. ఈనెల 7న సీఎం చేతుల మీద ప్రాజెక్టును ప్రారంభించడం సంతోషంగా ఉంది.- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి