సంభాల్లో పురాతన మెట్ల బావి.. 150 ఏండ్ల నాటిదిగా గుర్తింపు

బరేలి (యూపీ): ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా చాందౌసి టౌన్​లో 150 ఏండ్ల నాటి మెట్ల బావి బయటపడింది. ఇది లక్ష్మణ్ గంజ్ ఏరియాలో కనుగొన్నారు. రెండు రోజులుగా తవ్వకాలు చేపడ్తున్నారు. ఈ మెట్ల బావి.. బ్యాంకే బిహారి ఆలయానికి కనెక్ట్ అయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆలయాన్ని పునరుద్ధరిస్తామన్నారు. అవసరమైతే చుట్టుపక్కల ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని తెలిపారు. ఈ మెట్ల బావి ఎన్నేండ్ల కింద కట్టారు? ఎవరు నిర్మించారో తెలుసుకునేందుకు ఆర్కియాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు లేఖ రాస్తామన్నారు. కాగా, లక్ష్మణ్ గంజ్ లో బయటపడిన ఈ మెట్ల బావి చుట్టుపక్కల ఎక్కువగా ముస్లింలు నివాసం ఉంటున్నారు.

బ్యాంకే బిహారి టెంపుల్​కు అతికొద్ది దూరంలోనే ఈ మెట్ల బావి బయటపడింది. మొత్తం బావిని వెలికి తీసేందుకు తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అయితే, రెవెన్యూ డిపార్ట్​మెంట్ రికార్డుల ప్రకారం.. మెట్ల బావి సుమారు 400 మీటర్ల మేర విస్తరించి ఉండొచ్చని తెలుస్తున్నది. చెరువుగా రిజిస్టర్ అయినట్లు సమాచారం. బిలారీ రాజు తాతల కాలంలో ఈ మెట్ల బావి కట్టారని స్థానికులు చెప్తున్నారు. మొత్తం మూడు లెవల్స్​లో ఉండొచ్చని తెలిపారు. ఫస్ట్ లెవల్ ఇటుకలతో, మిగిలిన రెండు లెవల్స్ మార్బుల్స్ కట్టినట్లు చెప్పారు. బావితో పాటు నాలుగు గదులు కూడా ఉన్నట్లు వివరించారు. ఈ మెట్ల బావికి 150 ఏండ్ల చరిత్ర ఉన్నట్లు చెప్తున్నారు.