రిపబ్లిక్‌ డే పరేడ్‌కు వచ్చిన 150 మంది సైనికులకు కరోనా

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు వచ్చిన 150 మంది సైనికులకు కరోనా
వచ్చే ఏడాది(జనవరి-2021) జరగనున్న రిపబ్లిక్‌ డే వేడుకలపై కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం కన్పిస్తోంది. దీంతో కరోనా ప్రోటోకాల్‌ను కఠినంగా అనుసరించి ఈ ఏడాది వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఢిల్లీకి చేరుకున్న 150 మంది సైనికులకు కరోనా సోకినట్లు నిర్థారణకావడంతో అధికారులు అలర్టయ్యారు. రిపబ్లిక్‌డే పరేడ్‌ కోసం ఢిల్లీ చేరుకున్న వీరందరికీ అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఏడాది వివిధ ప్రాంతాలకు చెందిన బెటాలియన్‌ల నుండి సైనికులు రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకుంటారు. దీంతో ఈ ఏడాది కూడా వేలాది మంది సైనికులు పరేడ్‌ కోసం నవంబర్‌ చివరి వారంలో ఢిల్లీ చేరుకున్నారు. అధికారులు ఆదేశాలతో వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. 150 మంది సైనికులకు కరోనా నిర్థారణకావడంతో.. వీరందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం వీరి ప్రాథమిక కాంటాక్ట్‌లను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. రిపబ్లిక్‌ డే తో పాటు ఆర్మీడే పరేడ్‌ల కోసం వేలాది మంది సైనికులు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తుంటారని… అయితే కరోనా ప్రభావంతో ఈ ఏడాది ఎక్కువ మంది రాలేదని సంబంధిత అధికారులు తెలిపారు.