కుటుంబాల్లో చీకట్లు నింపుతున్న కరెంట్ షాక్

  • మూడు నెలల్లో 14  మంది మృత్యువాత
  • చనిపోయిన వారిలో ఎక్కువ మంది రైతులే

మెదక్​, శివ్వంపేట, వెలుగు: వెలుగులు పంచే కరెంట్​కుటుంబాల్లో చీకట్లు నింపుతోంది. జిల్లాలో మూడు నెలలుగా కరెంట్ షాక్ మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పొలాల వద్ద పని చేస్తున్న క్రమంలో ఎక్కువ  మంది రైతులు కరెంట్ షాక్ తో మృతి చెందుతున్నారు. శివ్వంపేట, పాపన్నపేట, రామాయంపేట, కౌడిపల్లి, చిన్నశంకరంపేట, అల్లాదుర్గం తదితర  మండలాల్లో 14  మంది వరకు చనిపోయారు. కొన్ని సంఘటనలు ప్రమాద వశాత్తు జరుగుతుండగా, మరికొన్ని అజాగ్రత్త వల్ల జరుగుతున్నాయి. కాగా ఇంటి పెద్ద అకస్మాత్తుగా చనిపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

ఒకే మండలంలో ఆరుగురు..

శివ్వంపేట మండలం ఉసిరిక పల్లి గ్రామంలో ఇంటి ముందు ఉన్న దండంపై బట్టలు ఆరేస్తుండగా సర్వీస్ వైరు దండంకు తగలడంతో  నీరుడి మణెమ్మ (40) షాక్​తగిలి మృతి చెందింది. ఇది గమనించి చిన్నమ్మను కాపాడేందుకు వెళ్లిన ఆమె మరిది కొడుకు భాను ప్రసాద్ (19) కు కూడా షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఇదే మండలం చండి గ్రామంలో ఒక సీడ్ కంపెనీలో పనిచేస్తున్న మల్లేశ్ (45) బోరు మోటర్ రిపేరు చేయడానికి ట్రాన్స్​ఫార్మర్​ బంద్​చేసే క్రమంలో కరెంట్​షాక్ తగిలి మృతి చెందాడు. 

ఇదే గ్రామంలో రైతు సుందరమోళ్ల పెంటయ్య (60) బోరు మోటార్ కు  విద్యుత్​ లైను తెగిపోవడంతో సరి చేస్తుండగా షాక్ కొట్టి చనిపోయాడు. గూడూరు గ్రామానికి చెందిన కొత్తపేట సరోజిని (65) గ్రామ శివారులో చింతపండు ఏరడానికి వెళ్లి  కోతుల బెడద నివారణ కోసం పొలానికి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్​కు తగలడంతో షాక్ కొట్టి  మృతి చెందింది. అల్లీపూర్ గ్రామంలో రైతు చంద్రమౌళి (40)  బోరు మోటర్ దగ్గర పిచ్చి మొక్కలు తొలగిస్తుండగా కరెంట్​ షాక్ తగిలి మృతి చెందాడు.

లైన్​మెన్​ మృతి

అల్లాదుర్గం మండలం మెట్టుగడ్డ చౌరస్తాలో 161వ నెంబర్​ నేషన్​ హైవే పక్కన ఉన్న ట్రాన్స్​ఫార్మర్​రిపేర్​చేసే క్రమంలో లైన్​మన్​గణేశ్ (24) షాక్ తగిలి మృతి చెందాడు.  రామాయంపేట మండలం  బాపనయ్య తండాకు చెందిన  రైతు కట్రోత్ లక్ష్మ (43) వ్యవసాయ పనుల నిమిత్తం పన్యా తండాకు చెందిన  మరో రైతు పొలం లోకి వెళ్లి ఒరం చేస్తున్నాడు. ఈ క్రమంలో పొలం  ఒడ్డుకు ఉన్న  కరెంట్ సర్వీస్ వైర్ గమనించక దానిపై పార పడడంతో షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు.  కౌడిపల్లి మండలం కొట్టాల గ్రామానికి చెందిన గరబోయిన జిందేశ్ (35) తన వ్యవసాయ పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో  తెగి పోయి కింద పడి ఉన్న సర్వీస్ వైర్ ను తొక్కడంతో షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు.

కారణాలు ఏంటంటే..?

కరెంట్​షాక్ ​మృతుల్లో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. వారు పొలాల వద్దే షాక్​ తగిలి ప్రాణాలు కోల్పోయారు. కొందరు బోరు మోటారుకు కరెంట్​ సరఫరా కావడం లేదని స్టార్టర్​ డబ్బాలు రిపేర్​ చేస్తుండగా షాక్​ తగిలి చనిపోగా, మరికొందరు పంట రక్షణకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్​కు తగిలి, ఇంకొందరు కింద తెగిపడిన సర్వీస్​ వైర్​ను చూడకుండా తొక్కడంతో షాక్​ కొట్టి మృతి చెందారు. సబ్​స్టేషన్​నుంచి లైన్​క్లియరెన్స్​(ఎల్​సీ) తీసుకోకుండా ట్రాన్స్​ఫార్మర్​ వద్ద రిపేర్​ చేస్తుండగా షాక్​ కొట్టి అల్లాదుర్గం మండలం మెట్టుతంతాలో ఓ లైన్​మన్ ​చనిపోయాడు. 

జాగ్రత్తలతో ప్రమాదాలు దూరం

కరెంట్​ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రైతులు పొలాల వద్ద ​స్టార్టర్​ డబ్బాలు ఐరన్​వి కాకుండా ప్లాస్టిక్​ వి ఏర్పాటు చేసుకోవాలి. స్టార్టర్ డబ్బా నుంచి బోరు మోటారుకు కనెక్షన్​ ఇచ్చే కేబుల్​ను తరచూ పరిశీలిస్తుండాలి. ఎక్కడైనా కేబుల్​కట్​అయితే వెంటనే తగిన విధంగా సరిచేసుకోవాలి. స్టార్టర్​ డబ్బాలో ఏదైనా సమస్య వస్తే కరెంట్​ సప్లై బంద్​ చేసిన తర్వాతే రిపేర్​ చేయాలి. పొలాలకు అడవి పందుల నుంచి రక్షణగా ఏర్పాటు చేసే ఫెన్సింగ్​కు పగటి పూట కరెంట్​సరఫరా నిలిపివేయాలి. ట్రాన్స్​ఫార్మర్ వద్ద రిపేర్​చేయాల్సి వస్తే సబ్​స్టేషన్​నుంచి ఎల్​సీ తీసుకున్న తర్వాతనే పని మొదలు పెట్టాలి. ​