IND vs AUS: 13 ఏళ్లకే ఘనమైన రికార్డు.. ఆసీస్ బౌలర్లను చితక్కొట్టిన యువ కెరటం

చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న అనధికారిక టెస్టులో భారత అండర్ 19 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన కనపరిచాడు. 58 బంతుల్లోనే 100 పరుగులు సాధించి భారత రెడ్-బాల్ క్రికెట్‌ రెకార్డుల్లోకెక్కాడు. అండర్ 19 క్రికెట్‌లో భారత్ తరుపున వేగవంతమైన సెంచరీ చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు, U19 రెడ్-బాల్ క్రికెట్‌లో సెంచరీ నమోదు చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. 

ALSO READ | IND vs BAN 2nd Test: కుప్పకూలిన బంగ్లాదేశ్.. టీమిండియా టార్గెట్ 95

మొదటి రోజు ఆటలో 47 బంతుల్లో 81* పరుగులు చేసి భారత్‌ను ఆదుకున్న సూర్యవంశీ.. రెండో రోజు మరో 11 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. కేవలం రెండు బంతుల తేడాతో యూత్ టెస్టుల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన మోయిన్ అలీ ఆల్-టైమ్ రికార్డును సరిదిద్దే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ మధ్యనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన ఇంగ్లిష్ ఆల్‌రౌండర్ 2005లో శ్రీలంకపై కేవలం 56 బంతుల్లోనే U19 టెస్టుల్లో వేగవంతమైన సెంచరీ చేసి రికార్డు నెలకొల్పాడు.

ఈ ఏడాది ప్రారంభంలో సూర్యవంశీ (అప్పుడు 12 ఏళ్లు) బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. రంజీ ట్రోఫీ 2023-24లో నాలుగు ఇన్నింగ్స్‌లలో 31 పరుగులు చేశాడు.